చైనా ఫోన్లపై నిషేధం లేదు.. కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్‌ క్లారిటీ

30 Aug, 2022 05:38 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ నుంచి ఎగుమతులు పెంచుకోవాలని చైనా మొబైల్‌ ఫోన్‌ కంపెనీలను కేంద్ర ప్రభుత్వం కోరింది. రూ.12,000లోపు విలువ చేసే చైనీ ఫోన్ల విక్రయాలపై నిషేధ ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. దేశీ ఎలక్ట్రానిక్‌ ఎకోసిస్టమ్‌లో భారత కంపెనీలకు కీలక పాత్ర ఉందంటూ, దీనర్థం విదేశీ బ్రాండ్లను మినహాయించడం కాదన్నారు.

‘‘మరిన్ని ఎగుమతులు పెంచుకోవాలని చైనా బ్రాండ్ల వద్ద మేము పారదర్శకంగా ప్రస్తావించాం. వాటి సప్లయ్‌ చైన్, ముఖ్యంగా విడిభాగాల సరఫరా వ్యవస్థ మరింత పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ఉండాలి’’అని రాజీవ్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. రూ.12 వేల లోపు ఫోన్లకు చైనా కంపెనీలను దూరం పెట్టాలన్న ప్రతిపాదన ఎక్కడి నుంచి వచ్చిందో తనకు తెలియదన్నారు. 2025–26 నాటికి 300 బిలియన్‌ డాలర్ల ఎలక్ట్రానిక్స్‌ తయారీ, 120 బిలియన్‌ డాలర్ల ఎగుమతులను చేరుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి 76 బిలియన్‌ డాలర్లుగా ఉంది.

మరిన్ని వార్తలు