మల్టీప్లెక్స్‌ను దాటనున్న ఓటీటీ

27 Aug, 2022 06:35 IST|Sakshi

2023 నాటికి రూ. 12,000 కోట్ల స్థాయికి పరిశ్రమ

50 కోట్లకు యూజర్ల సంఖ్య

ఎస్‌బీఐ రీసెర్చ్‌ నివేదిక

ముంబై: దేశీ ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) మార్కెట్‌ త్వరలో మల్టీప్లెక్స్‌ పరిశ్రమను అధిగమించనుంది. 2018లో రూ. 2,590 కోట్లుగా ఉన్న ఓటీటీల మార్కెట్‌ 2023 నాటికి రూ. 11,944 కోట్లకు పెరగనుంది. ఏటా 36 శాతం వృద్ధి సాధించనుంది. తద్వారా ఒకప్పుడు వీసీఆర్‌లు, వీసీపీ, వీసీడీలను కనుమరుగయ్యేలా చేసిన మల్టీప్లెక్స్‌లను దెబ్బతీయనుంది. ఎస్‌బీఐ రీసెర్చ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం 1980లలో తెరపైకి వచ్చిన వీసీఆర్, వీసీపీలు ఆ తర్వాత డీవీడీల్లాంటివి .. 2000ల తొలినాళ్లలో మెట్రో నగరాలు, పట్టణ ప్రాంతాల్లో మల్టీప్లెక్స్‌లు కుప్పతెప్పలుగా వచ్చే వరకూ హవా కొనసాగించాయి.

ఆ తర్వాత సాంకేతికాంశాలు, మల్టీప్లెక్స్‌ల ధాటికి అవి కనుమరుగయ్యాయి. ప్రస్తుతం ఓటీటీల హవాతో మల్టీప్లెక్స్‌లకు కూడా అదే గండం పొంచి ఉందని ఎస్‌బీఐ రీసెర్చ్‌ పేర్కొంది. ఓటీటీలు ఇప్పటికే వినోద రంగంలో 7–9 శాతం వాటాను దక్కించుకున్నాయని, అన్ని భాషల్లోనూ ఒరిజినల్‌ కంటెంట్‌ అందిస్తూ 40 పైచిలుకు సంస్థలు నిలకడగా వృద్ధి చెందుతున్నాయని వివరించింది. పరిశ్రమ వర్గాల అంచనా ప్రకారం ప్రస్తుతం దేశీయంగా 45 కోట్ల పైచిలుకు ఓటీటీ సబ్‌స్క్రయిబర్స్‌ ఉన్నారని, 2023 ఆఖరు నాటికి ఈ సంఖ్య 50 కోట్లకు చేరవచ్చని గ్రూప్‌ చీఫ్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ తెలిపారు. స్మార్ట్‌ టీవీలు, క్రోమ్‌కాస్ట్‌ వంటి ఆప్షన్లు సంప్రదాయ సినీ వినోదంపై గణనీయంగా ప్రభావం చూపాయని పేర్కొన్నారు.  

చౌక ఇంటర్నెట్‌ .. డిస్కౌంట్ల ఊతం..
ఇంటర్నెట్‌ వినియోగించే వారు పెరుగుతుండటం, చౌకగా వేగవంతమైన మొబైల్‌ ఇంటర్నెట్‌ లభిస్తుండటం, డిజిటల్‌ చెల్లింపుల వినియోగం పెరుగుతుండటం తదితర అంశాలు ఓటీటీల వృద్ధికి దోహదపడుతున్నాయి. ఆయా సంస్థలు డిస్కౌంటు రేటుకే సర్వీసులు అందిస్తుండటం కూడా ఇందుకు తోడ్పడుతోంది. డిస్నీ+హాట్‌స్టార్‌ (14 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్‌), అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో (6 కోట్ల మంది), నెట్‌ఫ్లిక్స్‌ (4 కోట్లు), జీ5 (3.7 కోట్లు), సోనీలివ్‌ (2.5 కోట్లు) తదితర సంస్థలు అమెరికాతో పోలిస్తే 70–90 శాతం చౌకగా తమ ప్లన్స్‌ అందిస్తున్నాయి. వూట్, జీ5, ఆల్ట్‌బాలాజీ, హోయ్‌చోయ్‌ లాంటి స్థానిక, ప్రాంతీయ ఓటీటీలకు కూడా డిమాండ్‌ బాగా ఉంటోంది. 50 శాతం మంది ఓటీటీలను నెలకు 5 గంటల పైగా వినియోగిస్తుండటంతో ఆ మేరకు థియేటర్ల లాభాలకు గండిపడనుంది. సాంప్రదాయ విధానాల్లో సినిమాల నిర్మాణంతో పోలిస్తే ఓటీటీల కోసం స్ట్రీమింగ్‌ సిరీస్‌లు, సినిమాలను తీయడమే లాభసాటిగా ఉంటోందని పెద్ద నిర్మాణ సంస్థలు గుర్తించాయి. తమ సొంత ఓటీటీలు ఉంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నాయి.  

నివేదికలోని మరిన్ని అంశాలు..
► రెండు ప్రపంచ యుద్ధాల సమయంలో కూడా లేని విధంగా కోవిడ్‌ కాలంలో థియేటర్లు మూతబడటం.. ఓటీటీలకు లాభించింది. ఈ వ్యవధిలో 30 పైగా హిందీ సినిమాలు డిజిటల్‌ ప్రీమియర్‌ జరుపుకున్నాయి. ప్రస్తుతం ప్రాంతీయ వెబ్‌ సిరీస్‌లు, సినిమాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా మరింతగా దృష్టి పెడుతున్నాయి.
►ఇప్పటికీ ఉచితంగా సర్వీసులు అందిస్తున్న ఓటీటీలే (యాడ్‌ ఆధారిత) ముందంజలో ఉంటున్నాయి. 2017లో వీటి వినియోగదారుల సంఖ్య 18.4 కోట్లుగా ఉండగా ఇది ఈ ఏడాది 35.1 కోట్లకు, 2027 నాటికి 46.6 కోట్లకు చేరనుంది.
►పే–పర్‌–వ్యూ సెగ్మెంట్‌లో సబ్‌స్క్రయిబర్స్‌ సంఖ్య 2018లో 3.5 కోట్లుగా ఉండగా, ఈ ఏడాది 8.9 కోట్లకు, 2027లో 11.7 కోట్లకు చేరనుంది.  
►రాబోయే రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాంలు విద్య, ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ తదితర రంగాల్లోకి కూడా విస్తరించనున్నాయి. తద్వారా తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. ఓటీటీలతో కంటెంట్‌ క్రియేటర్లకు కొత్త ఆదాయ మార్గాలు అందుబాటులోకి వచ్చాయి

మరిన్ని వార్తలు