కొత్త పోర్టల్‌పై 2 కోట్ల ఐటీఆర్‌లు దాఖలు

18 Oct, 2021 06:13 IST|Sakshi

సాంకేతిక సమస్యల పరిష్కారం

సీబీడీటీ ప్రకటన

న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ నూతన ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై 2020–21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2 కోట్లకు పైగా ఆదాయపన్ను రిటర్నులు (ఐటీఆర్‌లు) దాఖలైనట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ప్రకటించింది. కొత్త పోర్టల్‌ పనితీరు గణనీయంగా మెరుగైనట్టు తెలిపింది. ఇన్ఫోసిస్‌ అభివృద్ధి చేసిన నూతన పోర్టల్‌పై ఎన్నో సాంకేతిక సమస్యలు లోగడ దర్శనమివ్వడం తెలిసిందే. 2020–21 ఆర్థిక సంవత్సరం రిటర్నులను వీలైనంత ముందుగా నమోదు చేయాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. ఈ ఫైలింగ్‌కు వీలుగా అన్ని ఐటీఆర్‌లు అందుబాటులో ఉన్నట్టు పేర్కొంది.

దాఖలైన 2 కోట్లకు పైగా ఐటీఆర్‌లలో 86 శాతం.. ఐటీఆర్‌–1, ఐటీఆర్‌–4 ఉన్నట్టు, 1.70 కోట్ల ఐటీఆర్‌లు ఈ వెరిఫై పూర్తయినట్టు తెలిపింది. ఇందులో 1.49 కోట్ల ఐటీఆర్‌లు ఆధార్‌ ఓటీపీ ఆధారంగా ధ్రువీకరించినట్టు వివరించింది. తక్షణ రిఫండ్‌లకు వీలు కల్పిస్తూ, మరెన్నో సదుపాయాలతో కూడిన కొత్త ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ను ఆదాయపన్ను శాఖ ఈ ఏడాది జూన్‌ 7న ప్రారంభించింది. సమస్యలు ఎదురవుతున్నట్టు ఎంతో మంది పన్ను చెల్లింపుదారులు ఫిర్యాదు చేయడంతో.. వీటిని పరిష్కరించాలంటూ ఇన్ఫోసిస్‌ను కేంద్ర ఆర్థిక శాఖ కోరింది.

మరిన్ని వార్తలు