చికెన్‌ కేజీ ధర సగం తగ్గింది.. 

19 May, 2021 00:41 IST|Sakshi

నష్టాల్లో పౌల్ట్రీ పరిశ్రమ

భారమవుతున్న దాణా ఖర్చులు

పడిపోయిన చికెన్‌ వినియోగం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 దెబ్బతో పౌల్ట్రీ పరిశ్రమ కష్టాల కడలి ఈదుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తికి చికెన్‌ కారణమంటూ గత ఏడాది ప్రారంభంలో పుకార్లు వచ్చిన కారణంగా అమ్మకాలు 75 శాతం పడిపోయి ధర కిలోకు రూ.30కి చేరిన సంగతి తెలిసిందే. కొన్ని నెలల తర్వాత పరిశ్రమ క్రమంగా పుంజుకుంటున్న తరుణంలో సెకండ్‌వేవ్‌ రూపంలో దెబ్బతీసింది. ఇప్పటికే చికెన్‌ వినియోగం 30 శాతం తగ్గింది. తాజాగా కర్ఫ్యూ, లాక్‌డౌన్లతో పరిశ్రమకు కొత్త సవాల్‌ విసిరింది.  

కిలోకు రూ.40 దాకా నష్టం.. 
గతేడాది ఫామ్‌ గేట్‌ వద్ద బ్రాయిలర్‌ కోడి కిలోకు ధర సగటున రూ.85 నమోదైంది. ప్రస్తుతం ఇది రూ.60–65 మధ్య ఉంది. ఉత్పత్తి వ్యయం ఏడాదిలో కిలోకు రూ.20–25 అధికమై ఇప్పుడు రూ.95–100కు చేరిందని స్నేహా ఫామ్స్‌ సీఎండీ డి.రామ్‌రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ఈ లెక్కన కిలో కోడికి రైతుకు రూ.40 దాకా నష్టం వాటిల్లుతోందని చెప్పారు. గతేడాది నుంచి పరిశ్రమ నష్టాలను మూటగట్టుకుంటోందని వెల్లడించారు. ‘మొక్కజొన్న టన్నుకు ఏడాదిలో రూ.15,000 నుంచి రూ.17,000కు, సోయా రూ.40,000 నుంచి రూ.80,000కు చేరింది. దీంతో దాణా వ్యయం అదే స్థాయిలో అధికమైంది. కోళ్లకు వాడే మందులు రష్యా, చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి. వీటి ధరలు 30 శాతం పెరిగాయి’ అని వివరించారు.  

క్రమంగా తగ్గుతున్న వినియోగం.. 
సాధారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 15–16 లక్షల కోళ్లు అమ్ముడవుతాయి. ఇందులో ఒక్క హైదరాబాద్‌ వాటా 6 లక్షలు. ఇప్పుడీ వినియోగం 12 లక్షల కోళ్లకు వచ్చి చేరింది. కోవిడ్‌ ముందు వరకు మొత్తం చికెన్‌ అమ్మకాల్లో హోటళ్లు, ఫంక్షన్ల వాటా 25 శాతం ఉండేది. ప్రస్తుతం ఇది 5 శాతానికి వచ్చింది. వైరస్‌ ఉధృతితో శుభకార్యాలు దాదాపుగా వాయిదా పడ్డాయి. కొద్ది రోజుల క్రితం వరకు జరిగినా పరిమిత సంఖ్యలో అతిథులతో వేడుకలు కొనసాగాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ తోడు కావడంతో పౌల్ట్రీ పరిశ్రమ ఆందోళన చెందుతోంది.  

కేజీ ధర సగం తగ్గింది.. 
రిటైల్‌లో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర ఈ ఏడాది కిలోకు కనిష్టంగా రూ.140 పలికితే.. గరిష్టంగా రూ.300 వరకు వెళ్లింది. ప్రస్తుతం రూ.150–180 మధ్య ఉంది. అంటే ఈ ఏడాది అమ్ముడైన గరిష్ట ధరతో పోలిస్తే కిలోకు దాదాపు సగం తగ్గిందన్న మాట. 2019లో ధర రూ.340 దాకా పలికిందని హైదరాబాద్‌లోని విజయనగర్‌ చికెన్‌ సెంటర్‌ యజమాని బండి సాయి కిరణ్‌ తెలిపారు. కోవిడ్‌కు చికెన్‌ కారణమంటూ పుకార్లు రావడంతో గతేడాది ఫిబ్రవరి–మార్చిలో కిలో ధర రూ.30కి పడిపోయిందని చెప్పారు. ఆ తర్వాత క్రమంగా రూ.260 వరకు వెళ్లిందన్నారు. వైరస్‌ భయంతో ప్రస్తుతం జనాలు బయటకు రావడం లేదని, హోటళ్ల వ్యాపారం తగ్గడంతో చికెన్‌ అమ్మకాలు క్షీణించాయని చెప్పారు.

విలువ రూ.90,000 కోట్లు 
భారత పౌల్ట్రీ పరిశ్రమ విలువ రూ.90,000 కోట్లు.  ఈ పరిశ్రమకూ కోవిడ్‌–19 ముప్పుగా పరిణమించింది. పరిశ్రమలో దక్షిణాది వాటా ఏకంగా 70%. సగటు చికెన్‌ వినియోగం దేశంలో 4.5 కిలోలుంటే దక్షిణాదిన ఇది 8 కిలోలు ఉంది. ఇక పౌల్ట్రీలు ఏర్పాటు చేసి సొంతంగా మార్కెట్‌ చేసుకునేవారు తెలుగు రాష్ట్రాల్లో 25 శాతముంటారు. మిగిలిన వారంతా కాంట్రాక్ట్‌ వ్యాపారంలో ఉన్నవారే. అంటే రైతుల నుంచి కోళ్లను కొనుగోలు చేసి విక్రయిస్తుంటారు. ఇలా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ వ్యాపారంలో 100 వరకు కంపెనీలు ఉన్నట్టు సమాచారం. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు