Pre-Budget 2023: ఉపాధి కల్పనే ధ్యేయంగా బడ్జెట్‌..

22 Nov, 2022 04:48 IST|Sakshi

ఆర్థిక మంత్రి సీతారామన్‌కు

పారిశ్రామిక వర్గాల వినతి

పన్నుల హేతుబద్ధీకరణకు విజ్ఞప్తి

ప్రీ–బడ్జెట్‌ భేటీలో పలు సూచనలు  

న్యూఢిల్లీ: వినియోగాన్ని పెంచడానికి ఉపాధి కల్పనే ధ్యేయంగా వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) బడ్జెట్‌ను రూపొందించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు పారిశ్రామిక రంగం విజ్ఞప్తి చేసింది.  వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), వ్యక్తిగత ఆదాయపు పన్ను శ్లాబ్‌లను హేతుబద్ధీకరించాలని, తద్వారా పన్ను బేస్‌ను విస్తృతం చేసే చర్యలపై బడ్జెట్‌ దృష్టి పెట్టాలని ఆర్థిక మంత్రితో సోమవారం జరిగిన వర్చువల్‌ ప్రీ–బడ్జెట్‌ సమావేశంలో కోరాయి. ఈ సమావేశంలో తమ ప్రతినిధులు చేసిన సూచనలపై పారిశ్రామిక వేదికలు చేసిన ప్రకటనల ముఖ్యాంశాలు..  

ప్రైవేటీకరణకు ప్రాధాన్యం: సీఐఐ
‘అంతర్జాతీయ పరిణామాలు కొంతకాలం పాటు అననుకూలంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో దేశీయ డిమాండ్, అన్ని రంగాల పురోగతి,  వృద్ధి పెంపునకు చర్యలు అవసరం. ఉపాధి కల్పనను ప్రోత్సహించడం ద్వారా మన దేశీయ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసుకోవాలి. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ దూకుడుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థను గాడి తప్పకుండా చూడ్డానికి పెట్టుబడులకు దారితీసే వృద్ధి వ్యూహంపై దృష్టి పెట్టాలి. మూలధన వ్యయాల కేటాయింపుల పెంపునకు ప్రాధాన్యత ఇవ్వాలి.  ఉపాధి కల్పనను పెంచేందుకు ఉపాధి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టాలి. ముఖ్యంగా  పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  వ్యాపారాలకు సంబంధించి పన్ను ఖచ్చితత్వం అవసరం. ఇందుకుగాను కార్పొరేట్‌ పన్ను రేట్లను ప్రస్తుత స్థాయిలో కొనసాగించాలి. పన్నుల విషయంలో మరింత సరళీకరణ, హేతుబద్ధీకరణ, చెల్లింపులో సౌలభ్యత, వ్యాజ్యాల తగ్గింపు ప్రధాన ప్రాధాన్యతలుగా ఉండాలి’ అని సీఐఐ ప్రెసిడెంట్‌ సంజీవ్‌ బజాజ్‌ పేర్కొన్నారు.

పంచముఖ వ్యూహం: పీహెచ్‌డీసీసీఐ
‘కేంద్ర బడ్జెట్‌ (2023–24) భౌగోళిక–రాజకీయ అనిశ్చితులు, అధిక ద్రవ్యోల్బణం,  ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం వంటి కీలకమైన తరుణంలో రూపొందుతోంది. ఈ తరుణంలో స్థిరమైన ఆర్థిక వృద్ధి పథాన్ని కొనసాగించడానికి,  దేశీయ వృద్ధి వనరులను పెంపొందించడానికి కీలక చర్యలు అవసరం.  ముఖ్యంగా  ప్రైవేట్‌ పెట్టుబడులను పునరుద్ధరించడానికి పంచముఖ వ్యూహాన్ని అవలంభించాలి. వినియోగాన్ని పెంచడం, కర్మాగారాల్లో సామర్థ్య వినియోగాన్ని పెంచడం, ఉద్యోగాల అవకాశాల కల్పన, సామాజిక మౌలిక సదుపాయాల నాణ్యతను మెరుగుపరచడం,  భారతదేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటి చర్యలు ఇందులో కీలకమైనవి’అని పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ సాకేత్‌ దాల్మియా సూచించారు.æ  

శుక్రవారం రాష్ట్రాల ఆర్థికమంత్రులతో భేటీ
కాగా, ఆర్థికమంత్రి  సీతారామన్‌ వచ్చే శుక్రవారం (25వ తేదీ) రాష్ట్రాల ఆర్థికమంత్రులతో న్యూఢిల్లీలో ప్రీ–బడ్జెట్‌ సమావేశం నిర్వహించనున్నారు.
 

మరిన్ని వార్తలు