ఇండియాలో ఇక టెస్లా కార్లు.. ధర ఎంతంటే..?

22 Nov, 2023 19:24 IST|Sakshi

టెస్లా తన కార్లను ఇండియాలో ప్రవేశపెట్టాలని కొన్ని రోజులుగా ప్రయత్నిస్తోంది. తాజాగా భారత ప్రభుత్వంతో జరుపుతున్న చర్చలు సఫలమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఒకవేళ టెస్లాకు అన్ని పరిస్థితులు అనుకూలించి ఇండియాలో ప్రవేశిస్తే మొదటి మోడల్‌ కారు ధర 25వేల యూరోలు(రూ.22 లక్షలు) ఉండనుందని సమాచారం. 

ఈ మోడల్‌కారును మొదట జర్మనీలో తర్వాత భారతదేశంలో లాంచ్ చేయనున్నారని కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈ కథనాల ప్రకారం.. భారతదేశంలో టెస్లా మోడల్ వై క్రాస్ఓవర్ పేరుతో కారు లాంచ్‌ చేయబోతుంది. మోడల్ వై అనేది మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడుతుంది. ఈ క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీను తయారుచేసేందుకు 2020 నుంచి కంపెనీ పనిచేస్తోంది. మూడు వరుసల్లో ఏడుగురు ప్రయాణించేలా దీన్ని రూపొందించినట్లు తెలిసింది.

టెస్లా చాలారోజుల నుంచి భారత ప్రభుత్వంతో ఒక ఒప్పందం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం.. టెస్లా వాహనాలను వచ్చే ఏడాది నుంచి దేశంలోకి అనుమతిస్తారు. కంపెనీ రానున్న రెండేళ్లలో భారత్‌లో తయారీ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుందని బ్లూమ్‌బెర్గ్ తెలిపింది. వచ్చే ఏడాది జనవరిలో గుజరాత్‌లో జరిగే గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని చెప్పింది. టెస్లా భారతదేశంలో రూ.16 వేల కోట్లతో కొత్త ప్లాంట్‌ ప్రారంభించాలని యోచిస్తోంది. దేశీయ కంపెనీల నుంచి రూ.1.24 లక్షల కోట్ల విలువైన ఆటో విడిభాగాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టెస్లా దేశంలో బ్యాటరీలు కూడా తయారు చేయాలనుకుంటున్నట్లు సమాచారం. 

ఇదీ చదవండి: పక్షి కన్ను చూస్తున్న అర్జునుడి పాత్రలో ఆర్‌బీఐ: దాస్‌

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గతవారం తన అమెరికా పర్యటనలో భాగంగా ఫ్రీమాంట్‌లోని టెస్లా ఫ్యాక్టరీని సందర్శించారు. అక్కడ ఎలాన్‌మస్క్‌ను కలవాల్సి ఉంది. కానీ అనారోగ్యం కారణంగా మంత్రిని కలవలేకపోయానని క్షమాపణలు చెబుతూ మస్క్‌ తన ఎక్స్‌ ఖాతాలో ట్వీట్‌ చేశారు. త్వరలో మంత్రిని కలవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు