నిత్యావసరాల ధరలు స్థిరం: కేంద్రం

21 Oct, 2023 02:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో చక్కెర, వంట నూనెలు సహా నిత్యావసర ఆహార పదార్థాల ధరలు స్థిరంగా ఉంటాయని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్‌ చోప్రా భరోసా ఇచ్చారు. గోదుమలు, బియ్యం, పంచదార, వంట నూనెల వంటి ముఖ్యమైన ఆహార పదార్థాల దేశీయ సరఫరాలు, ధరలపై ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. దేశంలో ధరల స్థిరత్వానికి కేంద్రం ఎప్పటికప్పుడు తగిన నిర్ణయాలను తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

మే 22 నుండి గోధుమల ఎగుమతిపై నిషేధం, పార్బాయిల్డ్‌ బియ్యంపై మార్చి 2024 వరకు 20 శాతం ఎగుమతి సుంకం పొడిగింపు, పప్పుధాన్యాలపై స్టాక్‌ పరిమితులు, ‘నియంత్రిత’ కేటగిరీ కింద చక్కెర ఎగుమతుల పొడిగింపు వంటి అనేక ఆంక్షలు ధరల పెరుగుదలను నిరోధించడానికి దోహదపడతాయని తెలిపారు. దేశంలో వినియోగానికి తగిన చక్కెర నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు.

వంట నూనెల విషయంలో వేరుశెనగ నూనె మినహా మిగిలిన ఉత్పత్తులు రిటైల్‌ ధరలు తగ్గుముఖం పట్టాయన్నారు. గడచిన మూడు నాలుగు నెలల్లో బియ్యం ద్రవ్యోల్బణం 11 నుంచి 12 శాతం స్థాయిలో ఉన్నట్లు వెల్లడించారు. మార్కెట్‌లోకి కొత్త పంట ఉత్పత్తులు వస్తున్న నేపథ్యంలో, ధరలు మున్ముందు మరింత తగ్గుతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గోధుమల రిటైల్‌ ద్రవ్యోల్బణం ఏడాదిలో దాదాపు 3.6 శాతంగా ఉన్నట్లు తెలిపారు. దేశీయ అవసరాలకు తగిన బియ్యం, గోధుమల నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు