Provident Fund Rate: 40 ఏళ్ల తరువాత కేంద్రం షాకింగ్‌ నిర్ణయం..! ​కారణం అదేనట..?

13 Mar, 2022 08:12 IST|Sakshi

8.5 నుంచి 8.1 శాతానికి తగ్గింపు

వేతన జీవికి తీవ్ర నిరాశ

న్యూఢిల్లీ: మధ్య తరగతి వేతన జీవికి భారీ నిరాశ. ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిట్లపై వడ్డీ రేటు 8.5 నుంచి ఏకంగా 8.1 శాతానికి తగ్గుతోంది. ఇది దాదాపు 6 కోట్ల మంది సభ్యులపై ప్రభావం చూపనుంది. మార్చి 31తో ముగిసే 2021–22 ఆర్థిక సంవత్సరానికి 8.1 శాతం వడ్డీ చెల్లించాలని ఈపీఎఫ్‌వో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ శనివారం నిర్ణయించింది. 4 దశాబ్దాల్లో ఇదే అతి తక్కువ వడ్డీ రేటు! 1977–78లో 8 శాతముండగా తర్వాత ఏటా కనీసం 8.25, ఆపైనే ఉంటూ వచ్చింది. రూ.76,768 కోట్ల అంచనా ఆదాయం ఆధారంగా తాజాగా వడ్డీని నిర్ణయించారు. దీపావళి నాటికి సభ్యుల ఖాతాల్లో కొత్త వడ్డీ జమవుతుంది. ప్రావిడెంట్‌ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇతర చిన్న పొదుపు పథకాలతో సమానంగా 8 శాతం కంటే తగ్గించాలని కేంద్ర కార్మిక శాఖపై ఆర్థిక శాఖ కొన్నాళ్లుగా ఒత్తిడి తెస్తోంది. చిన్న పొదుపు పథకాలకు వడ్డీ రేటు 4 నుంచి 7.6 శాతం మధ్య ఉంది. రుణం, ఈక్విటీ నుండి వచ్చే ఆదాయాలను బట్టి వడ్డీ చెల్లింపును లెక్కిస్తారు. 

కరోనా దెబ్బ 
ఈపీఎఫ్‌వోఆదాయాన్ని కరోనా దెబ్బతీసింది. కోవిడ్‌ నేపథ్యంలో అధిక ఉపసంహరణలు, తక్కువ విరాళాలను ఈపీఎఫ్‌వో ఎదుర్కొంది. 2021 డిసెంబర్‌ 31 నాటికి అడ్వాన్స్‌ సౌకర్యం కింద రూ.14,310.21 కోట్లు అందించి 56.79 లక్షల క్లెయిమ్‌లను పరిష్కరించింది. దీంతో 2019–20 చెల్లింపులు ఆలస్యమయ్యాయి. వడ్డీనీ రెండు వాయిదాలలో చెల్లించారు. 2021–22లో ఈపీఎఫ్‌వోరూ.3,500 కోట్ల లోటు నమోదు చేసింది. ఈపీఎఫ్‌వో కార్పస్‌ 13 శాతం పెరిగినా వడ్డీ ఆదాయం 8 శాతమే పెరిగినట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో ఉందనేందుకు వడ్డీ రేటు తగ్గడం నిదర్శనమని సీబీటీ సభ్యుడు ఏకే పద్మనాభన్‌ అన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్‌ దృష్ట్యా సామాజిక భద్రతతో కూడిన పెట్టుబడి సమతుల్యతను కొనసాగించడం తమ ప్రాధాన్యత అని కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్‌ యాదవ్‌ అన్నారు. 


చదవండి: ఉద్యోగులకు బిగ్‌షాక్‌.. 40ఏళ్ల తరువాత కీలక నిర్ణయం!

>
మరిన్ని వార్తలు