పాత నోట్లు, కాయిన్స్‌పై ఆర్‌బీఐ హెచ్చరిక...!

5 Aug, 2021 16:06 IST|Sakshi

గత కొన్ని రోజుల నుంచి పాత కరెన్సీ నోట్లకు, పాత కాయిన్స్‌ను ఆన్‌లైన్‌లో సేల్‌కు పెట్టి భారీ నగదును పొందవచ్చుననే వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆన్‌లైన్ కొనుగోళ్లు, అమ్మకాలుకు సంబంధించి ఆర్బీఐ ప్రజలను హెచ్చరించింది. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) పాత కరెన్సీ నోట్లు, కాయిన్స్‌కు సంబంధించి బుధవారం (ఆగస్టు 4) రోజున హెచ్చరికలను జారీ చేసింది.  పాత కరెన్సీ నోట్లను, నాణేలను కమీషన్‌తో క్రయవిక్రయాలను అనధికారికంగా చేసే మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 

పాత కరెన్సీ నోట్లను, నాణేలను క్రయవిక్రయాలను జరిపే సమయంలో కొంతమంది వ్యక్తులు లేదా సంస్థలు ఆర్‌బీఐ పేరు, లోగోలను వాడుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు ఆర్‌బీఐ దృష్టికి వచ్చిందని అధికారులు వెల్లడించారు.  ఆన్‌లైన్‌ లేదా ఆఫ్‌లైన్‌ ఇతర మార్గాల ద్వారా పాత నోట్ల చలామణీ చేస్తూ ప్రజల నుంచి కమీషన్లు, వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. పాతనోట్లను , కాయిన్స్‌ను మార్చే సమయంలో ఏలాంటి ఛార్జీలు, కమిషన్లను ఆర్‌బీఐ స్వీకరించదని పేర్కొంది.

ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్వైమాసిక పాలసీ సమీక్ష బుధవారం రోజున ప్రారంభమైంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల సమావేశం మూడు రోజుల పాటు జరగనుంది. శుక్రవారం  (ఆగస్టు 6) రోజున ఈ కమిటీ కీలక నిర్ణయాలను వెల్లడించనుంది.

మరిన్ని వార్తలు