నెలకు రూ.400 కోట్ల రుణాలిచ్చే కంపెనీ.. మూసివేస్తున్నట్లు షాకింగ్‌ కామెంట్లు..

6 Dec, 2023 13:55 IST|Sakshi

ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ జెస్ట్‌మనీ తమ కార్యకలాపాలను నిలిపివేసినట్లు ప్రకటించింది. వ్యాపారం పునరుద్ధరించడానికి ఎన్నో ప్రయాత్నాలు చేశామని, కానీ అవి ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దాంతో తమ వద్ద పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు షాకింగ్‌ కామెంట్లు చేసింది. 

దేశంలో ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా రుణాలపై ఆధారపడుతున్నట్లు రిపోర్టులు చెబుతున్నాయి. భారత ప్రజల్లో వస్తు వినియోగం పెరుగుతోంది. ఈ క్రమంలో అనేక ‘బై నౌ పే లేటర్’ ఫిన్ టెక్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. ఇవి షాపింగ్‌ కోసం ప్రజలకు తక్కువ ఖర్చుతో రుణాలు కల్పిస్తున్నాయి. అలా ఏడాళ్ల కిందట జెస్ట్‌మనీ కంపెనీ ప్రారంభమైంది. దేశంలో ఈ వ్యాపార మోడల్‌పై నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులు కంపెనీని దెబ్బతీసినట్లు సమాచారం. దాంతో బిజినెస్‌ పునరుద్ధరించడంలో విఫలమైనట్లు కంపెనీ ప్రకటించింది. చివరికి సంస్థను మూసివేస్తున్నట్లు తెలిపింది. కంపెనీలో పనిచేస్తున్న 150 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పింది.

మూసివేతకు సంబంధించి ప్రక్రియ పూర్తి చేసే వరకు కొంతమంది కంపెనీలోనే ఉండనున్నట్లు వివరించింది. తొలగించిన ఉద్యోగులకు డిసెంబర్‌ నెల వేతనం ఇస్తామని జెస్ట్‌మనీ హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కొత్త ఉద్యోగం వెతుక్కోవడంలోనూ వారికి సహాయం చేస్తామని చెప్పినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. గతంలో జెస్ట్‌మనీను ఫోన్‌పేకు విక్రయించాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ ఒప్పందం కుదురకపోవడంతో కంపెనీ ముగ్గురు సహ వ్యవస్థాపకులు రాజీనామా చేశారు. దీంతో సంస్థ కొత్త నాయకత్వ బృందాన్ని నియమించింది. అయినా మూలధన అవసరాల నిమిత్తం నిధులను సమీకరించడం కష్టంగా మారింది. ఫలితంగా కంపెనీ మూసివేత అనివార్యమైందని సమాచారం. 

ఇదీ చదవండి: రూ.333 చెక్కుకు రూ.20 లక్షలు.. అదే ప్రత్యేకత!

వాస్తవానికి కంపెనీని 2016లో లిజ్జీ చాప్‌మన్, ప్రియా శర్మ, ఆశిష్ అనంతరామన్ స్థాపించారు.  కంపెనీ 17 మిలియన్ల కస్టమర్లను కలిగి ఉండి నెలకు రూ.400 కోట్ల రుణాలను పంపిణీ చేసేది. దేశంలో 10,000 ఆన్‌లైన్ బ్రాండ్‌లు, 75,000 ఆఫ్‌లైన్ స్టోర్‌లతో 27 రుణ, వ్యాపార భాగస్వాములను కలిగి ఉండేది. ఈ క్రమంలో  నియంత్రణ చట్టాల్లో వచ్చిన మార్పులతో వ్యాపారాన్ని కొనసాగించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని నెలల కిందట కంపెనీ యజమానులు బాధ్యతల నుంచి తప్పుకున్నారు.

>
మరిన్ని వార్తలు