రెనో, నిస్సాన్‌ భాగస్వామ్యం.. 2025 నాటికల్లా కొత్త విభాగంలోకి..

15 Jun, 2023 07:05 IST|Sakshi

చెన్నై: వాహన తయారీలో ఉన్న రెనో, నిస్సాన్‌ల సంయుక్త భాగస్వామ్య కంపెనీ నుంచి తొలి కారు భారత మార్కెట్లో 2025లో అడుగుపెట్టనుంది. ఈ మోడల్‌ 4 మీటర్లకుపైగా పొడవు ఉండనుంది. రూ.5,300 కోట్లతో రెండు చిన్న ఎలక్ట్రిక్‌ కార్లతోసహా ఆరు కొత్త ఉత్పత్తులను తేనున్నట్టు ఇరు సంస్థలు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించాయి. అలాగే చెన్నై సమీపంలోని ప్లాంటును ఆధునీకరించనున్నారు. ఆరు మోడళ్లలో రెనో నుంచి మూడు, నిస్సాన్‌ నుంచి మూడు రానున్నాయి. 

జేవీలో నిస్సాన్‌కు 51, రెనోకు 49 శాతం వాటా ఉంటుంది. ‘ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి ప్రవేశిస్తున్నాం. అలాగే నాలుగు మీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పెద్ద వాహనాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తాం. భారత్‌లో క్విడ్, కైగర్, ట్రైబర్‌ ప్యాసింజర్‌ కార్లను విక్రయిస్తున్నాం. 2022లో దేశీయంగా 84,000 యూనిట్లు రోడ్డెక్కాయి. 28,000 యూనిట్లు ఎగుమతి చేశాం. 2023లోనూ ఇదే స్థాయిలో అమ్మకాలు ఉంటాయి’ అని రెనో ఇండియా ఆపరేషన్స్‌ సీఈవో, ఎండీ వెంకట్‌రామ్‌ మామిళ్లపల్లె తెలిపారు.

మరిన్ని వార్తలు