ఎస్‌బీఐ ఖాతాదారులకు సంక్రాంతి శుభవార్త..!

16 Jan, 2022 19:06 IST|Sakshi

కొత్త ఏడాదిలో దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు శుభవార్త తెలిపింది. ఫిక్సిడ్ డిపాజిట్(ఎఫ్‌డి)పై అందించే వడ్డీ రేట్లను 10 బేసిస్ పాయింట్లు లేదా 0.10% వరకు పెంచినట్లు ప్రకటించింది. ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. 1 సంవత్సరం కాలపరిమితి నుంచి 2 సంవత్సరాల కంటే తక్కువ కాలానికి గల ఫిక్సిడ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 5.0% నుంచి 5.1%కి పెంచింది. అలాగే, అదే కాలానికి సీనియర్ సిటిజన్లకు అందించే వడ్డీ రేటును 5.50% నుంచి 5.60%కి పెంచినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు జనవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి.

డిసెంబర్ 2021లో ఎస్‌బీఐ తన బేస్ రేటును 0.10 శాతం లేదా 10 బిపిఎస్ పెంచినట్లు వెబ్‌సైట్‌లో తెలిపింది. కొత్త బేస్ రేటు (సంవత్సరానికి 7.55%) డిసెంబర్ 15, 2021 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక తక్కువ వడ్డీ రేట్లకు సమయం ముగిసింది అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా కనిపిస్తోంది. రుణగ్రహీతలకు లోన్స్ ఇచ్చేందుకు బేస్ రేటును కీలకంగా తీసుకుంటారు. బేస్ రేట్ పెరగడంతో అన్నీ రకాల వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ఫిక్సిడ్ డిపాజిట్ రేట్లు పడిపోయాయి. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరగడం అనేది బ్యాంకులో ఫిక్సిడ్ డిపాజిట్ చేసిన వారికి ఒక మంచి శుభవార్త.

ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఇటీవల ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచినట్లు ప్రకటించింది. హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం..రెండేళ్ల కంటే ఎక్కువ మెచ్యూరిటీ కాలానికి రూ.2 కోట్ల కంటే తక్కువ ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. 2 సంవత్సరాల 1 రోజు, 3 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి గత ఎఫ్‌డీలపై 5.2 శాతం వడ్డీని పొందొచ్చు. మెచ్యూరిటీ వ్యవధి 3 సంవత్సరాల 1 రోజు నుండి 5 సంవత్సరాల వరకు ఉంటే వడ్డీ 5.4 శాతం ఉంటుంది. చివరగా మెచ్యూరిటీకి 5 సంవత్సరాల 1 రోజు  నుంచి 10 సంవత్సర కాలానికి వడ్డీ రేటు 5.6 శాతంగా ఉండనుంది. పెరిగిన వడ్డీరేట్లు జనవరి 12నుంచి అమలులోకి రాగా.. రెసిడెంట్ డిపాజిట్లకు మాత్రమే రేట్లు వర్తిస్తాయి బ్యాంక్ తెలిపింది. ఇవి ఎన్నారైలకు వర్తించవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రతినిధులు తెలిపారు. 

(చదవండి: ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్‌ స్కూటర్లు కొన్నవారికి సీఈఓ భవిష్ అగర్వాల్ శుభవార్త..!)

మరిన్ని వార్తలు