నష్టాలు ఒకరోజుకే పరిమితం

12 Dec, 2020 06:24 IST|Sakshi

మళ్లీ రికార్డుల బాట పట్టిన సూచీలు

మెటల్, ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌ రయ్‌

ప్రభుత్వరంగ షేర్లకు మద్దతు 

సెన్సెక్స్‌ లాభం 139 పాయింట్లు 

13,514 వద్ద ముగిసిన నిఫ్టీ

ముంబై: స్టాక్‌ మార్కెట్‌కు నష్టాలు ఒకరోజుకే పరిమితం అయ్యాయి. సూచీలు మళ్లీ రికార్డుల బాట పట్టాయి. సెన్సెక్స్, నిఫ్టీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేయడంతో పాటు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్‌లో పీఎస్‌యూ బ్యాంక్స్, మెటల్, ఎఫ్‌ఎంజీసీ షేర్లు రాణించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 139 పాయింట్లను ఆర్జించి 46 వేలపైన 46,099 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 36 పాయింట్లను ఆర్జించి 13,514 వద్ద నిలిచింది. ఫార్మా, ఐటీ, ఆటో షేర్లు మాత్రం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 46,310 వద్ద గరిష్టాన్ని, 45,706 వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ సైతం 13,579–13,403 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,195 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా..  దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,359 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. ఈ వారం మొత్తం మీద సెన్సెక్స్‌ 1019 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 255 పాయింట్లను ఆర్జించింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 604 పాయింట్ల రేంజ్‌లో, నిఫ్టీ 176 పాయింట్ల పరిధిలో కదలాడాయి.  

ప్రభుత్వ రంగ కంపెనీ కౌంటర్లలో సందడి..: కొన్ని రోజులుగా స్తబ్దుగా ట్రేడ్‌ అవుతున్న ప్రభుత్వరంగ కంపెనీల కౌంటర్లో శుక్రవారం సందడి నెలకొంది. ఫలితంగా ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, గెయిల్, కోల్‌ ఇండియా షేర్లు 5 శాతం నుంచి 3 శాతం దాకా లాభపడ్డాయి.

ఆరుశాతం పెరిగి స్పైస్‌జెట్‌...  
స్పైస్‌జెట్‌ కంపెనీ షేరు బీఎస్‌ఈలో ఆరుశాతం లాభపడింది. కోవిడ్‌–19 వ్యాక్సిన్ల సరఫరాకు రవాణా సంస్థలైన ఓం లాజిస్టిక్స్, స్నోమన్‌ లాజిస్టిక్స్‌తో భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడంతో ఇందుకు కారణమైంది. ఇంట్రాడేలో ఎనిమిది శాతం ర్యాలీ రూ.108 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 6.52 శాతం లాభంతో రూ. వద్ద స్థిరపడింది.  

బర్గర్‌ కింగ్‌ లిస్టింగ్‌ సోమవారం: గతవారంలో పబ్లిక్‌ ఇష్యూను పూర్తి చేసుకున్న బర్గర్‌ కింగ్‌ షేర్లు సోమవారం స్టాక్‌ ఎక్చ్సేంజీల్లో లిస్ట్‌ కానున్నాయి. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు