వారెవ్వా.. మార్కెట్లు ధూమ్‌ధామ్‌

24 Nov, 2020 15:57 IST|Sakshi

తొలిసారి 13,000 ఎగువన ముగిసిన నిఫ్టీ

మార్చిలో నమోదైన కనిష్టం నుంచి 75 శాతం జూమ్

‌12,000 పాయింట్ల నుంచి 13,000కు.. 18 నెలలు

446 పాయింట్లు జంప్‌చేసి 44,523 వద్ద నిలిచిన సెన్సెక్స్

‌చరిత్రాత్మక గరిష్టాల వద్ద ముగిసిన ఇండెక్సులు

ముంబై, సాక్షి: ఈ ఏడాది మార్చిలో కుప్పకూలాక జోరందుకున్న మార్కెట్లు బుల్‌ వేవ్‌లోనే కదులుతున్నాయి. కరోనా వైరస్‌ కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్న వార్తలు ఇన్వెస్టర్లకు జోష్‌నిస్తున్నాయి. దీంతో ఇండెక్సులు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నాయి. వెరసి దేశీ స్టాక్‌ మార్కెట్లలో పలు రికార్డులు నమోదవుతున్నాయి. తాజాగా  ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 129 పాయింట్లు ఎగసింది. మార్కెట్‌ చరిత్రలో తొలిసారి13,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి 13,055 వద్ద ముగిసింది. ఇక సెన్సెక్స్‌ సైతం 44,523 పాయింట్లు జంప్‌చేసి 44,523 వద్ద స్థిరపడింది. తద్వారా సెన్సెక్స్‌, నిఫ్టీ లైఫ్‌టైమ్‌ గరిష్టాలను సాధించాయి. ఈ బాటలో ఇంట్రాడేలోనూ సెన్సెక్స్‌ 44,601 వద్ద, నిఫ్టీ 13,079 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. కోవిడ్‌-19 కట్టడికి ఈ ఏడాది చివరికల్లా ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకాసహా పలు కంపెనీలు వ్యాక్సిన్లను విడుదల చేయనున్న వార్తలు సెంటిమెంటుకు బలాన్నిస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. 

నిఫ్టీ జోరు
కరోనా వైరస్‌ విలయంతో ఈ ఏడాది మార్చి 24న నిఫ్టీ 7,511 పాయింట్లకు పడిపోయింది. ఇది రెండేళ్ల కనిష్టంకాగా.. తదుపరి ర్యాలీ బాట పట్టింది. 8 నెలల్లోనే 75 శాతం దూసుకెళ్లింది. 13,000 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. అయితే గతేడాదిలో 12,000 పాయింట్ల మార్క్‌ను అందుకున్నాక 13,000కు చేరేందుకు 18 నెలల సమయం తీసుకోవడం గమనార్హం! 

బ్యాంక్స్‌ భేష్‌
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ లాభపడ్డాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో, రియల్టీ, ఫార్మా, మెటల్ 2.5- శాతం మధ్య వృద్ధి చూపాయి. నిఫ్టీ దిగ్గజాలలో అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్, ఐషర్‌, హిందాల్కో, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, డాక్టర్‌ రెడ్డీస్‌ 4.5-2.8 శాతం మధ్య ఎగశాయి. ఇతర బ్లూచిప్స్‌లో టైటన్‌, హెచ్‌డీఎఫ్‌సీ‌, బీపీసీఎల్‌, నెస్లే, గెయిల్‌, శ్రీ సిమెంట్‌, ఓఎన్‌జీసీ, అల్ట్రాటెక్‌, ఎయిర్‌టెల్‌, ఐవోసీ 1.5-0.4 శాతం మధ్య బలహీనపడ్డాయి.

బాష్‌ జూమ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో బాష్‌ 10 శాతం జంప్‌చేయగా.. ఆర్‌బీఎల్‌ బ్యాంక్, శ్రీరామ్‌ ట్రాన్స్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, అరబిందో, ఎస్‌ఆర్‌ఎఫ్‌, పిరమల్‌ 6-3.5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోపక్క జీఎంఆర్‌, జూబిలెంట్‌ ఫుడ్‌, అపోలో హాస్పిటల్స్‌, టీవీఎస్‌ మోటార్, యూబీఎల్‌, ముత్తూట్‌ 3-1.2 శాతం మధ్య డీలా పడ్డాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్ క్యాప్స్‌ 0.6-0.9 శాతం చొప్పున ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1,637 లాభపడగా.. 1,174 నష్టాలతో ముగిశాయి.   

ఎఫ్‌పీఐల ఇన్వెస్ట్‌మెంట్స్‌
నగదు విభాగంలో సోమవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 4,738 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేయగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 2,944 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. వారాంతాన ఎఫ్‌పీఐలు రూ. 3,861 కోట్లను ఇన్వెస్ట్‌ చేయగా.. డీఐఐలు రూ. 2,869 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న విషయం విదితమే. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు