సెంట్రో గ్రూప్‌ చేతికి రష్యా బ్యాంక్‌ - 50 శాతం వాటా కొనుగోలు

6 Oct, 2023 07:43 IST|Sakshi

ముంబై: ఒక రష్యన్‌ బ్యాంకులో మెజారిటీ వాటాను కొనుగోలు చేసినట్లు డైవర్సిఫైడ్‌ సంస్థ సెంట్రో గ్రూప్‌ తాజాగా పేర్కొంది. సోవియట్‌ శకం ముగిసిన తదుపరి ఏర్పాటైన బ్యాంక్‌లో 50.001 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు వెల్లడించింది. 29ఏళ్ల బ్యాంకును దక్కించుకోవడం ద్వారా రుపీ–రూబుల్‌ వాణిజ్యానికి తోడ్పాటునివ్వనున్నట్లు తెలియజేసింది. 

భారత్‌తో వాణిజ్యం, లావాదేవీలు పుంజుకుంటున్న నేపథ్యంలో రెండు దేశాల మధ్య లావాదేవీలను సులభతరం చేసే లక్ష్యంతో ఉన్నట్లు సెంట్రో గ్రూప్‌ పేర్కొంది. రష్యాకు ప్రాధాన్యతగల భాగస్వామిగా భారత్‌ ఆవిర్భవిస్తున్నట్లు తెలియజేసింది. పరస్పర నోస్ట్రో, వోస్త్రో ఖాతాలకు వీలుగా భారత బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థలతో జత కట్టే యోచనలో ఉన్నట్లు సెంట్రో గ్రూప్‌ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ నవీన్‌ రావు వివరించారు. 

బ్రోకర్‌ లైసెన్స్, రష్యన్‌ రిటైల్‌ ఇన్వెస్టర్‌ లక్ష్యంగా ఎఫ్‌పీఐ లైసెన్స్‌ ద్వారా భారత్‌లో పెట్టుబడులకు వీలు కల్పించడం తదితర చట్టబద్ధ విధానాల ద్వారా బ్యాంకు సర్వీసులను విస్తరించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలియజేశారు. రూబుల్, రూపాయి చెల్లింపులకు మద్దతివ్వడం ద్వారా రెండు దేశాల వ్యక్తులు పరస్పర సందర్శనకు సహకరించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా యూపీఐ, రూపే కార్డ్‌ తదితర చెల్లింపుల విధానాలకు వీలు కల్పించనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు