నేడు భారీ లాభాలతో ఓపెనింగ్‌‌?! 

1 Oct, 2020 08:29 IST|Sakshi

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 117 పాయింట్లు ప్లస్‌

నిఫ్టీకి 11,300-11,353 వద్ద రెసిస్టెన్స్‌!

యూఎస్‌ మార్కెట్లు 1.2-0.7 శాతం అప్‌

ప్రస్తుతం సానుకూలంగా ఆసియా మార్కెట్లు

అమ్మకాల బాట వీడని విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు

నేడు(1న) దేశీ స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.15 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 117 పాయింట్లు జంప్‌చేసి 11,361 వద్ద ట్రేడవుతోంది. బుధవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,244 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 విసురుతున్న సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా మళ్లీ భారీ సహాయక ప్యాకేజీని ప్రకటించేందుకు అమెరికన్‌ కాంగ్రెస్‌ చర్చిస్తున్న నేపథ్యంలో బుధవారం యూఎస్‌ మార్కెట్లు 1.2-0.7 శాతం మధ్య ఎగశాయి. ఇక ప్రస్తుతం ఆసియా మార్కెట్లలోనూ సానుకూల ధోరణి కనిపిస్తోంది. ఈ అంశాల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు హుషారుగా ప్రారంభంకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 

కన్సాలిడేషన్..‌
వరుసగా రెండో రోజు బుధవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆద్యంతం ఒడిదొడుకుల మధ్య కదిలాయి. చివరికి సెన్సెక్స్‌ 95 పాయింట్లు బలపడి 38,068 వద్ద నిలిచింది. వెరసి 38,000 పాయింట్ల కీలక మార్క్‌ను అధిగమించింది. ఇక నిఫ్టీ 25 పాయింట్లు పుంజుకుని 11,247 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,236 వద్ద గరిష్టాన్ని తాకగా.. 37,828 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇదే విధంగా నిఫ్టీ సైతం 11,295- 11,185 పాయింట్ల మధ్య ఊగిసలాడింది. 

నిఫ్టీ కదలికలు?
నేడు మార్కెట్లు బలహీనపడితే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి తొలుత 11,190 పాయింట్ల వద్ద, తదుపరి 11,132 వద్ద మద్దతు లభించవచ్చని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారు. ఒకవేళ మార్కెట్లు బలపడితే.. తొలుత 11,300 పాయింట్ల వద్ద, ఆపై 11,353 వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని తెలియజేశారు. ఇక బ్యాంక్‌ నిఫ్టీకి తొలుత 21,204 పాయింట్ల వద్ద, తదుపరి 20,957 వద్ద సపోర్ట్‌  లభించవచ్చని అంచనా వేశారు. ఇదే విధంగా తొలుత 21,625 పాయింట్ల వద్ద, తదుపరి 21,797 స్థాయిలో బ్యాంక్‌ నిఫ్టీకి అవరోధాలు కనిపించవచ్చని భావిస్తున్నారు.

ఎఫ్‌పీఐల అమ్మకాలు
నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 712 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 409 కోట్లకుపైగా ఇన్వెస్ట్‌ చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 1,457 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 577 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు