ఓలా ఈవీని మించిపోయిన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్

15 Aug, 2021 18:11 IST|Sakshi

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ వేహికల్ స్టార్టప్ సింపుల్ ఎనర్జీ దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ ను ₹1.10 లక్షల(ఎక్స్ షోరూమ్, మైనస్ సబ్సిడీలు) ధర వద్ద లాంఛ్ చేసింది. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ₹1,947 రీఫండ్ చేయగల ప్రీ బుకింగ్ ధరకు బుకింగ్ చేసుకోవచ్చు. ప్రీ బుకింగ్ ₹1,947 ధరను భారతదేశనికి స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరానికి గుర్తుగా పెట్టారు. తమిళనాడులోని హోసూర్ లోని ప్లాంట్ లో ఈవీ మేకర్ తన సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల(Simple One Electric Scooter)ను తయారు చేస్తుంది. మొదటి దశలో ఏడాదికి ఒక మిలియన్ వాహనాల వార్షిక ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉన్నట్లు కంపెనీ తెలిపింది.

4.8 కిలోవాట్స్ బ్యాటరీ
కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, గోవా, ఉత్తరప్రదేశ్ సహా తొలి దశలో దేశవ్యాప్తంగా మొత్తం 13 రాష్ట్రాల్లో ఈ-స్కూటర్ అందుబాటులోకి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఆరు కిలోల బరువున్న 4.8 కిలోవాట్స్ గల పోర్టబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. దీని డిటాచబుల్, పోర్టబుల్ స్వభావం వల్ల ఇంటి వద్ద ఈ-స్కూటర్ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. దీని సింపుల్ లూప్ ఛార్జర్ తో 60 సెకన్ల వ్యవధిలో 2.5 కిలోమీటర్ల రేంజ్ వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఛార్జ్ చేయవచ్చు.

236 కిలోమీటర్ల రేంజ్
ఈవీ కంపెనీ రాబోయే మూడు నుంచి ఏడు నెలల్లో దేశవ్యాప్తంగా 300కి పైగా పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్లను కూడా ఇన్ స్టాల్ చేస్తుంది. ఈ-స్కూటర్ ను సింగిల్ ఛార్జ్ చేస్తే ఎకో మోడ్ లో 203 కిలోమీటర్ల దూరం వెళ్లవచ్చు. ఇండియన్ డ్రైవ్ సైకిల్(ఐడీసీ) పరిస్థితుల్లో 236 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇది 3.6 సెకన్లలో 0 నుంచి 50 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అలాగే, 2.95 సెకన్లలో 0 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో స్ప్రింట్ చేయగలదు. స్కూటర్ కు 4.5 కెడబ్ల్యు పవర్ అవుట్ పుట్, 72 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఫ్యూచరిస్టిక్ డిజైన్
ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో వస్తుంది. ఇది 30 లీటర్లబూట్ సామర్థ్యం, 12 అంగుళాల వీల్స్, 7 అంగుళాల కస్టమైజబుల్ డిజిటల్ డ్యాష్ బోర్డ్, ఆన్ బోర్డ్ నావిగేషన్, జియో ఫెన్సింగ్, ఎస్ఓఎస్ సందేశం, డాక్యుమెంట్ స్టోరేజీ, టైర్ ప్రజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లూటూత్ కనెక్టివిటీతో వస్తుంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ రెడ్, వైట్, బ్లాక్, బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. సింపుల్ వన్ ఈ-స్కూటర్ ఏథర్, హీరో ఎలక్ట్రిక్, ఓలా ఎలక్ట్రిక్ వంటి స్కూటర్లతో పోటీ పడనుంది.

మరిన్ని వార్తలు