వరుణ్‌ బెవరేజెస్‌ చేతికి బెవ్కో 

20 Dec, 2023 01:07 IST|Sakshi

డీల్‌ విలువ రూ. 1,320 కోట్లు 

న్యూఢిల్లీ: పానీయాల దిగ్గజం పెప్సీకో ఫ్రాంచైజీ సంస్థ వరుణ్‌ బెవరేజెస్‌.. దక్షిణాఫ్రికా కంపెనీ బెవరేజ్‌ కంపెనీ(బెవ్కో)తోపాటు అనుబంధ సంస్థలను కొనుగోలు చేయనుంది. దక్షిణాఫ్రికా, లెసోఠో, ఎస్వటీని ప్రాంతాలలో పెప్సీకో ఫ్రాంచైజీ హక్కులను బెవ్కో కలిగి ఉంది. 3 బిలియన్‌ రాండ్ల(జెడ్‌ఏఆర్‌) (రూ. 1,320 కోట్లు) ఎంటర్‌ప్రైజ్‌ విలువలో సొంతం చేసుకోనున్నట్లు వరుణ్‌ బెవరేజెస్‌ వెల్లడించింది.

తద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో కార్యకలాపాలు విస్తరించనుంది. నమీబియా, బోట్స్‌వానా పంపిణీ హక్కులతోపాటు.. అత్యంత కెఫైన్‌ కంటెంట్‌ డ్రింక్‌ రీఫ్రెష్, ఎనర్జీ డ్రింక్‌ రీబూస్ట్, కార్బొనేటెడ్‌ డ్రింక్‌ కూఈ, జైవ్, ఫిజ్జీ లెమనేడ్‌ బ్రాండ్లను బెవ్కో కలిగి ఉంది. 2024 జులై31లోగా నగదు ద్వారా లావాదేవీని పూర్తి చేసే వీలున్నట్లు వరుణ్‌ అంచనా వేస్తోంది.  

5 తయారీ కేంద్రాలు 
2023లో బెవ్కో రూ. 1,590 కోట్ల టర్నోవర్‌ సాధించినట్లు వరుణ్‌ తెలియజేసింది. జోహన్నెస్‌బర్గ్‌లో రెండు, దర్బన్, ఈస్ట్‌ లండన్, కేప్‌టౌన్‌లో ఒకటి చొప్పున మొత్తం ఐదు తయారీ యూనిట్లను కలిగి ఉంది. నిమిషానికి 3,600 బాటిళ్ల(బీపీఎం) సామర్థ్యం సంస్థ సొంతం. బెవ్కో కొనుగోలు ద్వారా దక్షిణాఫ్రికా మార్కెట్లో విస్తరించనున్నట్లు వరుణ్‌ వెల్లడించింది.

ఆఫ్రికా ఖండంలో దక్షిణాఫ్రికా అతిపెద్ద పానీయాల మార్కెట్‌కాగా.. రానున్న నాలుగేళ్లలో అంటే 2027కల్లా వార్షిక సగటున 5.3 శాతం చొప్పున వృద్ధి చూపగలదని అంచనా. దేశీయంగా పెప్సీకో అమ్మకాల పరిమాణంలో వరుణ్‌ బెవరేజెస్‌ 90 శాతాన్ని ఆక్రమిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది(2022–23) రూ. 10,596 కోట్ల ఆదాయం సాధించింది. 
బెవ్కో కొనుగోలు వార్తలతో వరుణ్‌ బెవరేజెస్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.7 శాతం జంప్‌చేసి రూ. 1,174 వద్ద ముగిసింది.  

>
మరిన్ని వార్తలు