Starlink: సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్‌ మస్క్‌!

3 Nov, 2023 17:44 IST|Sakshi

ప్రైవేటు రాకెట్ కంపెనీ స్పేస్‌ఎక్స్‌(SpaceX)కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ యూనిట్ స్టార్‌లింక్ (Starlink) నగదు ప్రవాహ బ్రేక్‌ఈవెన్‌ (సంతృప్త నగదు నిల్వలు)ను సాధించిందని దాని అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించారు. ఈ మేరకు తన మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో ట్వీట్‌ చేశారు.

‘స్పేస్‌ఎక్స్‌కు చెందిన స్టార్‌లింక్‌ బ్రేక్ఈవెన్ నగదు ప్రవాహాన్ని సాధించిందని ప్రకటించేందుకు సంతోషిస్తున్నాను! అద్భుతమైన బృందం సాధించిన విజయం ఇది’ అని ‘ఎక్స్‌’ పోస్టులో ఎలాన్‌ మస్క్‌ రాసుకొచ్చారు. ‘స్టార్‌లింక్ ఇప్పుడు అన్ని యాక్టివ్ శాటిలైట్‌లలోనూ మెజారిటీగా ఉంది. వచ్చే ఏడాది నాటికి అన్ని ఉపగ్రహాలను భూమిపై నుంచి ప్రయోగించనుంది’ అని కూడా పేర్కొన్నారు.

స్టార్‌లింక్‌ అనేది స్పేస్‌ఎక్స్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాటిలైట్‌ ఇంటర్నెట్ సమూహం. ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలకు కవరేజీని అందిస్తోంది. 2019లో స్టార్‌లింక్ ఉపగ్రహాలను ప్రయోగించిడం ప్రారంభించిన స్పేస్‌ఎక్స్‌ 2023 తర్వాత అంతర్జాతీయ మొబైల్‌ ఫోన్ సేవలను కూడా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

అత్యంత విలువైన కంపెనీ
ప్రపంచంలోని అత్యంత విలువైన ప్రైవేట్ కంపెనీలలో ఒకటైన స్పేస్‌ఎక్స్‌ కంపెనీ విలువ సుమారు 150 బిలియన్‌ డాలర్లు (రూ.12 లక్షల కోట్లకు పైగా). స్టార్‌లింక్ గత సంవత్సరం ఆదాయంలో ఆరు రెట్లు ఎక్కువ వృద్ధిని నమోదు చేసింది. 1.4 బిలియన్‌ డాలర్లు ఆర్జించింది. అయితే మస్క్ నిర్దేశించిన లక్ష్యాల కంటే ఇది తక్కువే అని వాల్ స్ట్రీట్ జర్నల్ గత సెప్టెంబర్‌లో నివేదించింది.

స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్ వంటి మరిన్ని మూలధన-ఇంటెన్సివ్ ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడానికి స్టార్‌లింక్ వ్యాపార విభాగాన్ని ఒక ముఖ్యమైన ఆదాయ వనరుగా మార్చాలని భావిస్తోంది. స్టార్‌షిప్ అనేది ఒక పెద్ద పునర్వినియోగ రాకెట్, దీన్ని రాబోయే దశాబ్దంలో నాసా కోసం చంద్రునిపైకి పంపించనున్నారు. 2019 నుంచి ఈ కంపెనీ తక్కువ-భూమి కక్ష్యలో తన నెట్‌వర్క్‌ను దాదాపు 5వేల ఉపగ్రహాలకు పెంచింది.

యుద్ధ ప్రాంతాలలో స్టార్‌లింక్ పాత్ర
గతేడాది యుద్ధ సమయంలో ఉక్రెయిన్‌కు శాటిలైట్ కమ్యూనికేషన్స్‌లో సాయమందించిన స్టార్‌లింక్.. తాజాగా గాజాలోనూ కమ్యూనికేషన్ సేవలు అందించనున్నట్లు ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించారు.

మరిన్ని వార్తలు