సంవత్‌ 2076 ధనాధన్‌ వీడ్కోలు

14 Nov, 2020 05:15 IST|Sakshi

ముంబై: స్టాక్‌ మార్కెట్‌ సంవత్‌ 2076 ఏడాదికి లాభాలతో వీడ్కోలు పలికింది. బలహీన అంతర్జాతీయ సంకేతాలతో రోజంతా తీవ్ర ఆటుపోట్లను ఎదుర్కొన్న సూచీలు... ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్‌ బ్యాంక్, ఇన్ఫోసిస్‌ లాంటి అధిక వెయిటేజీ షేర్ల ర్యాలీ అండతో పరిమిత లాభాలను ఆర్జించాయి. సెన్సెక్స్‌ 86 పాయింట్ల లాభంతో 43,443 వద్ద, నిఫ్టీ 29 పాయింట్లు పెరిగి 12,720 వద్ద స్థిరపడ్డాయి. ఇంట్రాడేలో మెటల్, ఫార్మా, ఐటీ, రియల్టీ రంగాలకు కొనుగోళ్ల మద్దతు లభించింది. సూచీలకిది వరుసగా రెండో వారమూ లాభాల ముగింపు.  

నేడు మూరత్‌ ట్రేడింగ్‌... 
స్టాక్‌ మార్కెట్‌కు ఈరోజు సెలవు దినమైనప్పటికీ.., దీపావళి సందర్భంగా సాయంత్రం 6.15 – 7.15 గంటల మధ్య మూరత్‌ ట్రేడింగ్‌ జరుగుతుంది. ప్రతి ఏడాది దీపావళి రోజున సాయంత్రం మూరత్‌ ట్రేడింగ్‌ను నిర్వహించడం స్టాక్‌ ఎక్సే్ఛంజీలకు ఆనవాయితీ. 

సంతోషాల్ని పంచిన సంవత్‌ 2076...  
సంవత్‌ 2076 ఏడాదిలో స్టాక్‌ మార్కెట్‌ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నప్పటికీ.., ఇన్వెస్టర్లకు సంతోషాల్ని పంచింది. ఈ ఏడాదిలో సెన్సెక్స్‌ 4,385 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 1,136 పాయింట్ల లాభపడింది. నిఫ్టీ–50 లోని మొత్తం 50 షేర్లకు గానూ 23 షేర్లు రెండంకెల ఆదాయాలను ఇచ్చాయి. అత్యధికంగా దివీస్‌ ల్యాబ్స్‌ 91 శాతం లాభపడింది. జనవరిలో సూచీలు జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. అయితే కోవిడ్‌–19 మహమ్మారి మార్కెట్‌లో పెను ఉత్పాతాన్నే సృష్టించింది.

లాక్‌డౌన్‌తో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో సూచీలు ఆల్‌టైం హై నుంచి మూడేళ్ల కనిష్టానికి దిగివచ్చాయి. తర్వాత లాక్‌డౌన్‌ ఎత్తివేత, ప్రపంచమార్కెటలో సానుకూలతలు, మెప్పించిన కంపెనీల క్యూ2 ఫలితాలు, యాజమాన్యాల ఆశాజనక అవుట్‌లుక్‌ వ్యాఖ్యలతో సూచీలు మార్చి కనిష్ట స్థాయిల నుంచి ఏకంగా 62 శాతం ర్యాలీ చేశాయి. ఈ క్రమంలో ఈ వారంలోనే మరోసారి సరికొత్త చారిత్రాత్మక గరిష్టస్థాయిలను లిఖించాయి. కాగా,సంవత్‌ 2077 ఏడాదిలో అప్రమత్తత అవసరమని మార్కెట్‌ నిపుణులు సూచిస్తున్నారు. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా