భారీగా పెరిగిన మార్కెట్లు.. వచ్చే వారం ఎలా ఉండనుందంటే..

9 Dec, 2023 10:43 IST|Sakshi

వచ్చే వారంలో మార్కెట్‌ ఎలా  ర్యాలీ అవ్వబోతుంది.. గతవారంలో జీవితకాల గరిష్ఠాన్ని తాకిన స్టాక్‌మార్కెట్లు రానున్న రోజుల్లో ఎలా స్పందిస్తాయి? బ్యాంకింగ్‌ రంగంలో ఎఫ్‌ఐఐ పెట్టుబడుల ప్రభావం ఎలా ఉండబోతుంది? వంటి వివరాలపై ప్రముఖ బిజినెస్‌ కన్సల్టెంట్‌  కారుణ్యరావు  మాట్లాడారు.

స్టాక్ మార్కెట్లు సరికొత్త గరిష్ఠాలను తాకడంతో చాలా మంది మదుపరులు కొంత లాభాలు స్వీకరించాలనే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుత మార్కెట్ల సరళిచూస్తే ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. ఇప్పటికే చాలా పెరిగిన మార్కెట్లు ఇకెంత పెరుగుతాయనే భావనతో ప్రస్తుత స్థాయుల వద్ద లాభాలు స్వీకరిస్తే మరింత ర్యాలీని అందిపుచ్చుకునే అవకాశం కోల్పోయే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. 

అయితే నిఫ్టీ సైకలాజికల్‌గా 21,000 మార్కును తాకితే అక్కడి నుంచి దిద్దుబాటు అవుతుందని అంచనా. గడిచిన వారం మూడు కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో మార్కెట్లు ఆశించిన దానికంటే ఎక్కువ సానుకూల ఫలితాలు కనిపించాయి. రాష్ట్ర ఎన్నికలతో పోల్చితే ఓటర్లు సాధారణంగా లోక్‌సభ ఎన్నికల్లో భిన్నంగా ఓటు వేస్తారనే భావన ఉంది. అయితే రానున్న మార్చి-ఏప్రిల్‌లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో తిరిగి స్పష్టమైన ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాతో మార్కెట్లు ర్యాలీ అవుతున్నట్లు తెలుస్తోంది. 

ఆర్‌బీఐ ఇటీవల దేశ వృద్ధిరేటును 7 శాతానికి పెంచింది. అందరూ అనుకున్న దానికంటే ఇది 0.3-0.5 శాతం పెంచి వృద్ధిరేటు అంచనా వేసింది. భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో వృద్ధి కొనసాగుతుందనే నమ్మకంతో పెట్టుబడిదారులు మరింత పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. 

బ్యాంకింగ్‌రంగ స్టాక్‌లు గడిచివ వారంలో నిఫ్టీ అంత ర్యాలీ అవ్వలేదని తెలుస్తోంది. అయితే ఆర్‌బీఐ తీసుకొస్తున్న నిర్ణయాలు, పెరుగుతున్న నిరర్ధక ఆస్తుల వల్ల బ్యాంకింగ్‌ రంగంపై మదుపరులు కొంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే ఎఫ్‌ఐఐలు అధికంగా ఇష్టపడే రంగాల్లో బ్యాంకింగ్‌ ఒకటి. ఇప్పటివరకు నిఫ్టీలో ర్యాలీ కనిపించినంతగా బ్యాంక్‌ నిఫ్టీలో స్టాక్‌లు పుంజుకోలేదు. ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మొదలైతే మాత్రం మొదటి ప్రాధాన్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌ను ఎంచుకుంటారని తెలుస్తోంది. 

భారతదేశ జీడీపీ వృద్ధిరేటు ఏటా 5-8 శాతం పెరుగుతుందని అంచనా. ఇలా అంచనా మేరకు వృద్ధి చెందితే నాలుగేళ్లలో ఆదాయాలు 20 శాతానికి చేరుతాయి. పెట్టుబడిదారులు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఫండమెంటల్స్‌పై దృష్టి పెట్టాలి. మార్కెట్ కదలికలను అంచనా వేయడానికి బదులుగా ప్రాథమికంగా బలమైన కంపెనీలను విశ్లేషించాలి. మంచి ఫండమెంటల్‌ కంపెనీలను ప్రతి మార్కెట్ డిప్‌లో కొనుగోలు చేసేలా సిద్ధంగా ఉండాలి.

>
మరిన్ని వార్తలు