రాజ్యసభలో 'యానిమల్‌' చిత్రంపై కాంగ్రెస్‌ ఎంపీ ఫైర్‌

9 Dec, 2023 07:22 IST|Sakshi

రణ్‌బీర్‌ కపూర్‌ - రష్మిక కాంబినేషన్‌లో డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగా  తెరకెక్కించిన చిత్రం 'యానిమల్‌'. పాన్‌ ఇండియా రేంజ్‌లో​ బాక్సాఫీస్‌ వద్ద విజయవంతంగా ఈ చిత్రం రన్‌ అవుతుంది. ఈ సినిమాలో సందీప్‌ మేకింగ్‌ స్టైల్‌, నటీనటుల ప్రదర్శనను ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలు మెచ్చుకున్నారు. రేణు దేశాయ్‌, అల్లు అర్జున్‌, రామ్‌ గోపాల్‌ వర్మ వంటి వారందరూ కూడా ఈ చిత్రాన్ని అభినందించారు.

ఇదిలా ఉంటే మరోవైపు యానిమల్ సినిమాపై విపరీతంగా ట్రోలింగ్ కూడా నడుస్తుంది. సమాజానికి ఈ సినిమా ఏ మేసేజ్‌ను ఇస్తుందని నెటిజన్లు ప్రశ్నిస్తున్న సమయంలో తాజాగా ఛత్తీస్ ఘడ్‌కు చెందిన ఓ మహిళా ఎంపీ యానిమల్‌ చిత్రంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ రంజీత్ రంజన్ ఈ టాపిక్‌పై ఏకంగా రాజ్యసభలోనే మాట్లాడారు. సమాజానికి పట్టిన జబ్బుగా యానిమల్ సినిమాను ఆమె అభివర్ణించారు.

యానిమల్ సినిమా చూసి తన కూతురు ఏడ్చిందంటూ ఆమె చెప్పుకొచ్చారు.  యానిమల్‌ సినిమాలో మహిళల పట్ల హింస దారుణంగా ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 'సినిమా అనేది సమాజంలో చాలా ప్రభావం చూపించగలదు. మనం సినిమాను చూస్తూనే పెరిగాం. కాబట్టి సినిమా అనేది యువతను ప్రేరేపిస్తుంది. వారిపై సినిమా ప్రభావం కూడా పడుతుంది. నా కూతురు తన స్నేహితులతో కలిసి యానిమల్‌ చిత్రానికి వెళ్లింది.  కానీ సినిమా మధ్యలోనే ఏడుస్తూ బయటకు వచ్చేసింది.' అని రాజ్యసభలో ఎంపీ రంజీత్ రంజన్ చెప్పారు.

యానిమల్ సినిమాలో సిక్కుల యుద్ధ గీతం అయిన అర్జన్ వైలీని దారుణమైన ఓ హింసాత్మక సీన్ కోసం వాడుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. మొఘల్స్, బ్రిటీష్‌తో పోరాడిన సిక్కు యోధుల వీరగాధను ప్రపంచానికి తెలిపిన ఈ పాటను ఇలా వాడుకోవడం ఏ మాత్రం సహించలేని విషయం అని ఆమె తెలిపారు.

>
మరిన్ని వార్తలు