మెల్లను నయంచేసే హెడ్‌సెట్‌.. కళ్లద్దాలు, ఆపరేషన్లు అవసరం లేదు!

25 Jun, 2023 12:00 IST|Sakshi

కంటి సమస్యల్లో మెల్ల చిన్నప్పుడే ఏర్పడి, జీవితాంతం వేధిస్తుంది. లావాటి కళ్లద్దాలతో మెల్ల వల్ల ఏర్పడే దృష్టిలోపాన్ని చక్కదిద్దుకోవచ్చు. శస్త్రచికిత్సతో మెల్లకన్నును పూర్తిగా మామూలుగా చేసుకోవచ్చు. అయితే, ఇవి కొంత ఇబ్బందికరమైన ప్రక్రియలు. మెల్లను నయం చేయడానికి ఇటీవల దక్షిణ కొరియాకు చెందిన త్రీడీ విజువల్‌ డిజైనర్‌ హేచాన్‌ ర్యు ఒక ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ని రూపొందించారు. 

‘సింప్లిసిటీ విత్‌ ప్రొఫెషనలిజం’ (ఎస్‌డబ్ల్యూపీ) పేరుతో రూపొందించిన ఈ హెడ్‌సెట్‌ని కళ్లను కప్పి ఉంచేలా తయారు చేశారు. ఇందులోని లెన్స్‌ దీనిని ధరించిన వారి లోపానికి అనుగుణంగా సర్దుకుని, సౌకర్యవంతంగా చూసేందుకు వీలు కల్పిస్తాయి. ఈ హెడ్‌సెట్‌లోని మోటరైజ్డ్‌ ప్రిజమ్‌ లోపల తిరుగుతూ కళ్లకు తగిన వ్యాయామం కల్పిస్తుంది. ఇది క్రమంగా మెల్లకంటిని సరైన కోణంలోకి తీసుకొస్తుంది. లోపం పూర్తిగా నయమయ్యేంత వరకు దీనిని కొన్ని వారాల నుంచి నెలల పాటు వాడాల్సి ఉంటుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.

మరిన్ని వార్తలు