రుణగ్రహీతలకు ‘సుప్రీం’ ఊరట!

11 Sep, 2020 05:31 IST|Sakshi

మరో 2 వారాలు ఎన్‌పీఏలుగా ప్రకటించొద్దు

గత ఆదేశాలను పొడిగించిన సుప్రీంకోర్టు

మారటోరియం వడ్డీ రద్దు పరిష్కారానికి కమిటీ ఏర్పాటు చేశామన్న కేంద్రం

న్యూఢిల్లీ:  తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు మొండిపద్దుల కిందకు రాని అకౌంట్లు వేటినీ ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దని గతంలో ఇచ్చిన మధ్యంతర ఆదేశాలను సుప్రీంకోర్టు మరో రెండు వారాలు పొడిగించింది. మారటోరియం సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ విధింపు అంశాన్ని పరిశీలించేందుకు ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేశామని కేంద్రం సుప్రీం కోర్టుకు తెలిపింది.

రెండు వారాల్లో ఈ విషయమై అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆర్‌బీఐ, కేంద్రాన్ని సుప్రీం ఆదేశించింది. అన్ని అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని సూచిస్తూ విచారణను ఈనెల 28కి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్‌ అశోక్‌ భూషణ్, జస్టిస్‌ సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ ఎంఆర్‌ షాతో కూడిన ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో తుది నిర్ణయానికి ఇదే ఆఖరు అవకాశమని, ఆపై ఈ అంశాన్ని వాయిదా వేయడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది.

కరోనా సంక్షోభం వేళ ఈఎంఐలపై మారటోరియం విధిస్తూ గతంలో ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ సమయంలో చెల్లించని వాయిదాలపై వడ్డీ వేయడాన్ని సవాలు చేస్తూ రుణగ్రహీతలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు, తుది ఆదేశాలు ఇచ్చేవరకు ఆగస్టు 31వరకు ఎన్‌పీఏలు కాని ఏ అకౌంట్లనూ ఎన్‌పీఏలుగా ప్రకటించవద్దని ఆదేశించింది.  

వడ్డీపై వడ్డీతో ఇబ్బంది..: ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న రుణ పునర్‌వ్యవస్థీకరణతో 95 శాతం మంది రుణగ్రహీతలకు న్యాయం జరగదని క్రెడాయ్‌ తరఫు న్యాయవాది కపిల్‌ సిబల్‌ కోర్టు దృష్టికి తెచ్చారు. బ్యాంకులు రుణగ్రహీతల అకౌంట్ల డౌన్‌గ్రేడింగ్‌ చేస్తూనే ఉన్నాయని, దీన్ని నిలిపివేయాలని, మారటోరియంను పొడిగించాలని కోరారు. బ్యాంకులు మారటోరియం సమయానికి చక్రవడ్డీలు లెక్కకడుతున్నాయని మరో న్యాయవాది రాజీవ్‌ దత్తా చెప్పారు. లక్షలాది మంది కరోనా కారణంగా ఆస్పత్రుల పాలయ్యారని, అనేకమంది ఉపాధి కోల్పోయారని, ఈ సమయంలో వడ్డీ మీద వడ్డీ అడగడం సబబు కాదని వాదించారు.

అయితే ఉన్న నియమాల ప్రకారమే డౌన్‌గ్రేడింగ్‌ జరుగుతోందని ఆర్‌బీఐ న్యాయవాది వీ గిరి చెప్పారు. అన్ని అంశాలను అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తున్నందున రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు. తాజా విచారణలో కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. ప్రభుత్వం అన్ని అంశాలనూ అత్యున్నత స్థాయిలో పరిశీలిస్తోందని చెప్పారు. సరైన నిర్ణయం తీసుకొనేందుకు రెండువారాల సమయం ఇవ్వాలని కోరారు.  వాదనలన్నీ విన్న కోర్టు 2 వారాల్లో సరైన పరిష్కారంతో రావాలని, ఆపై తాము తుది నిర్ణయం తీసుకుంటామంది.

రాజీవ్‌ మహర్షి నేతృత్వం
మారటోరియం సమయంలో రుణాలపై వడ్డీ రద్దు అంశాన్ని సమీక్షించి, సిఫారసులు చేయడానికి రాజీవ్‌ మహర్షి నేతృత్వంలో  కమిటీ  ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం గురువారం ప్రకటించింది.

మరిన్ని వార్తలు