దేశంలోని తొలి బుల్లెట్ రైల్వే స్టేషన్ అదిరిపోయిందిగా..!

10 Feb, 2022 18:08 IST|Sakshi

దేశంలోని ముంబై-అహ్మదాబాద్‌ నగరాల మధ్య తొలి బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులు కొనసాగుతున్న సంగతి మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మార్గంలో నిర్మిస్తున్న సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు సంబంధించిన గ్రాఫికల్ డిజైన్ ఫోటోలను రైల్వే, జౌళి శాఖ మంత్రి దర్శన జార్దోష్ తన ట్విటర్ ఖాతా వేదికగా షేర్ చేశారు. జార్దోష్ ట్విటర్ పోస్టులో ఇలా పేర్కొన్నారు.. "సూరత్ బుల్లెట్ ట్రైన్ స్టేషన్ గ్రాఫికల్ డిజైన్ చిత్రాలను మీ అందరితో పంచుకుంటున్నాను. అత్యాధునిక పరిజ్ఞానంతో బహుళ-అంతస్థులలో నిర్మిస్తున్న ఈ స్టేషన్ లోపల ప్రదేశం మెరిసే వజ్రాన్ని - సూరత్ నగరాన్ని పోలి ఉంటుందని" ఆమె తెలిపారు.

సూరత్ బుల్లెట్ రైలు స్టేషనుకు చెందిన బయట, లోపలికి సంబంధించిన రెండు గ్రాఫికల్ చిత్రాలతో సహ మరోక చిత్రంలో స్టేషన్ నిర్మిస్తున్న ఫోటోలను షేర్ చేసింది. 2017లో అప్పటి జపాన్‌ ప్రధాని షింజో అబెతో కలిసి ప్రధాని మోదీ ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం 2023 డిసెంబరు నాటికి తొలి ప్రయాణం చేయాలన్నది లక్ష్యం. కానీ, మహారాష్ట్రలో భూ సేకరణలో జాప్యం, కోవిడ్-19 మహమ్మారి వల్ల మార్చి 2020లో ప్రకటించిన దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కారణంగా గడువును 2028 వరకు పొడిగించారు. ఫిబ్రవరి 9 నాటికి గుజరాత్ రాష్ట్రంలో 98.63 శాతం, దాద్రా అండ్ నగర్ హవేలీలో 100 శాతం, మహారాష్ట్రలో 60.2 శాతం భూ సేకరణ జరిగింది.

నిర్మాణంలో ఉన్న ఈ 508 కిలోమీటర్ల పొడవైన ముంబై-అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ కారిడార్ దేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు ప్రాజెక్టు. ఈ మొత్తం ప్రాజెక్టు పొడవులో 348 కిలోమీటర్లు గుజరాత్ రాష్ట్రంలో, 4 కిలోమీటర్లు కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా అండ్ నగర్ హావేలీలో, మిగిలిన 156 కిలోమీటర్ల దూరం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు. అందులో 81 శాతం సొమ్ము జపాన్‌ నుంచి రుణంగా అందనుంది. 2026లో సూరత్ - బిలిమోరా మధ్య 50 కిలోమీటర్ల విస్తీర్ణంలో మొదటి బుల్లెట్ రైలు ట్రయల్ రన్ జరుగుతుందని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్నావ్ గత ఏడాది సెప్టెంబర్ నెలలో చెప్పారు.

(చదవండి: మార్కెట్‌లోకి కేటీఎమ్ ఎలక్ట్రిక్ బైక్.. ఇక కుర్రకారు తగ్గేదె లే!)

మరిన్ని వార్తలు