కాటేసిన బాబాయ్‌.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే.. | Sakshi
Sakshi News home page

కాటేసిన బాబాయ్‌.. టాటా చెబుతూ నవ్వుతూ వెళ్లిన చిన్నారి.. అంతలోనే..

Published Thu, Feb 10 2022 6:10 PM

Suspicious Deceased Eight Year Old Girl in Krishna District - Sakshi

కంచికచర్ల(నందిగామ)\‍కృష్ణా జిల్లా: అండగా ఉండాల్సిన సొంత బాబాయి చిన్నారిని కిరాతకంగా కడతేర్చాడు. ఈ దారుణ ఘటన కంచికచర్ల మండలంలో బుధవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సేకరించిన సమాచారం ప్రకారం.. కంచికచర్ల మండల పరిధిలోని కీసర గ్రామంలో ఉన్న ఖాళీ స్థలంలో గత కొద్ది రోజులుగా సంచార జాతులకు చెందిన పలు కుటుంబాలు నివసిస్తున్నాయి. వారు నిత్యం చిత్తు కాగితాలు సేకరించటంతో పాటు సమీప గ్రామాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఆ కుటుంబాల్లో పెదాల శ్రీను, వెంకటమ్మ దంపతులకు ద్రాక్షావలి (8), ఏసమ్మ అనే ఇద్దరు కుమార్తెలున్నారు. చదువుకోవాల్సిన వయస్సులో వీరిద్దరూ తల్లిదండ్రుల సహాయకులుగా నిలుస్తున్నారు. వీరి కుటుంబంలో ఎవ్వరికి కూడా ఆధార్‌ కార్డులు లేవు.

చదవండి: బాలికను ప్రేమించి.. ఆపై వంచించి.. ఆ తర్వాత తాళిని తెంచేసి..  

ఊరికి తీసుకు వెళ్తానని చెప్పి..  
మైలవరంలో నివాసముంటున్న శ్రీను తమ్ముడు,  మృతురాలి బాబాయి అయిన సైదులు తన ప్లాట్‌ ఫాం రిక్షాపై అన్నయ్య ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత తల్లిదండ్రులకు పెద్ద పాప ద్రాక్షావలిని తన ఊరికి తీసుకెళ్లతానని చెప్పి రిక్షాపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు.

బాలిక మృతదేహం కలకలం.. 
బుధవారం గ్రామ సమీపంలోని ఓ కర్మాగారంలో పని చేస్తున్న కార్మికుడు పక్కనే ఉన్న సుబాబుల్‌ తోటలోకి బహిర్బూమికి వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ నిర్జీవంగా పడి ఉన్న చిన్నారి మృతదేహాన్ని గమనించి, తోటి కార్మికుల ద్వారా పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే స్పందించిన  పోలీసులు ఘటనా స్థలంలో ఉన్న చిన్నారి చెప్పులు, గౌనుతో పాటు పరిసర ప్రాంతాల్లో ఆధారాలను సేకరించారు. క్లూస్‌టీం, డాగ్‌ స్క్వాడ్‌ను రంగంలోకి దింపారు.

సీసీ ఫుటేజీ ఆధారంగా.. 
టోల్‌ ప్లాజాలోని సీసీ కెమెరాల ద్వారా ఆధారాలను సేకరించారు. సోమవారం సాయంత్రం.4.10 గంటల సమయంలో సైదులు ద్రాక్షావలిని రిక్షాపై తీసుకెళ్తున్నట్లు రికార్డుల్లో గుర్తించారు. పోలీసులు ప్రాథమిక విచారణ ప్రకారం ద్రాక్షావలిని వెంట తీసుకెళ్లి లైంగికదాడి చేయటంతో పాటు బాబాయే హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. అదే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా మైలవరంలో నివాసముండే నిందితుడిగా భావిస్తున్న సైదులు కోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఐవీ నాగేంద్రకుమార్‌ తెలిపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ.. 
సమాచారం అందుకున్న నందిగామ డీఎస్పీ జి.నాగేశ్వరరెడ్డి, రూరల్‌ సర్కిల్‌ సీఐ ఐవీ నాగేంద్రకుమార్, కంచికచర్ల, వీరులపాడు ఎస్‌ఐలు జి.జయలక్ష్మీ, సోమేశ్వరరావు, ఏఎస్‌ఐ రమేష్‌బాబులు పోలీస్‌ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. 

టాటా చెబుతూ వెళ్లిన చిన్నారి..  
బాబాయి వెంట ఊరికి వెళ్తున్నాను అంటూ తల్లిదండ్రులకు టాటా చెప్పి నవ్వుతూ వెళ్లిన చిన్నారి ద్రాక్షావలి హత్యకు గురవడంతో వారు గుండెలవిసేలా రోదిస్తున్నారు.

Advertisement
Advertisement