వారికి ఉచితం.. వరద బాధితులకు సుజుకీ ఆఫర్‌

9 Dec, 2023 21:16 IST|Sakshi

మిచాంగ్ (Michaung) తుపాన్ ప్రభావంతో తమిళనాడు రాజధాని చెన్నై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరదలతో అక్కడి ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. ఇక వర్షపు నీటితో వాహనాలన్నీ పాడైపోయాయి. ఈ క్రమంలో వీరికి అండగా జపనీస్ వాహన తయారీ సంస్థ సుజుకీ మోటార్ కార్పొరేషన్‌కు భారతీయ అనుబంధ సంస్థ అయిన సుజుకీ మోటర్‌సైకిల్ ముందుకు వచ్చింది.

చెన్నైతోపాటు  పొరుగు జిల్లాల్లో వరద ప్రభావిత వినియోగదారులకు ఉచిత సర్వీస్‌ను ప్రారంభించినట్లు సుజుకీ మోటర్‌సైకిల్‌ సంస్థ శనివారం తెలిపింది. వరద బాధితులపై వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం దీని లక్ష్యం. చెన్నై, చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూరులో డీలర్ నెట్‌వర్క్‌లను యాక్టివేట్ చేసి వినియోగదారులకు ఉచిత సమగ్ర చెకప్‌లతో సర్వీస్‌ అందిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. దీంతోపాటు డిసెంబర్ చివరి వరకు ఇంజిన్ ఆయిల్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఫ్యూయల్ ఫిల్టర్‌లను ఉచితంగా రీప్లేస్‌మెంట్ చేస్తున్నట్లు తెలిపింది.

మిచాంగ్‌ తుఫాను పలు నగరాల్లోని ప్రజల జీవితాలు, వారి వస్తువులపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ నేపథ్యంలో వారి కోసం ప్రత్యేక సహాయ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సుజుకీ మోటర్‌సైకిల్‌ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. దీని కింద వాహనాల సర్వీస్‌తో పాటు అవసరమైన విడిభాగాలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఈ చొరవ వాహన మరమ్మతుల ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా తమ కస్టమర్‌ల కోసం మొబిలిటీని త్వరగా పునరుద్ధరించడాన్ని వేగవంతం చేస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: ఏకంగా రూ.91 వేల కోట్ల ఆస్తి.. పనివాడే వారసుడు!

>
మరిన్ని వార్తలు