జెరోధా: కామత్‌ సోదరులు తీసుకునే జీతాలెంతో తెలుసా?

9 Dec, 2023 14:22 IST|Sakshi

భారత్‌లో అతిపెద్ద బ్రోకరేజీ సంస్థ జెరోధా వ్యవస్థాపకులు నితిన్‌, నిఖిల్‌ కామత్‌ సోదరులు ఒక్కొక్కరు దాదాపు రూ.72 కోట్ల వార్షిక వేతనాన్ని పొందుతున్నట్లు తెలుస్తోంది. గత ఆర్ధిక సంవత్సరం 2022-2023 కాలానికి ఇద్దరూ కలిపి రూ.195.4 కోట్లు తీసుకున్నారని ఎన్‌ట్రాకర్‌ నివేదిక తెలిపింది. 

జెరోధా సీఈఓ నితిన్‌ కామత్‌ భార్య సీమా పాటిల్‌ రూ.36 కోట్లు, చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ వేణుమాధవ్‌ రూ.15.4 కోట్లు తీసుకుంటున్నారు. ఇక జెరోధాకు మొత్తం ముగ్గురు డైరక్టర్లు ఉన్నారు. వారిలో ఇద్దరు కామత్​ బ్రదర్స్​. కాగా.. డైరక్టర్లు రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్​ తీసుకోవచ్చని 2021లో బోర్డ్‌ ఆమోదం తెలిపింది. ఇక ఆర్ధిక సంవత్సరం 2023లో జీరోదా ఎంప్లాయీ బెనిఫిట్​ 35.7శాతం పెరిగి రూ. 623 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరంలో అది రూ. 459 కోట్లుగా ఉండేది.

వందల కోట్లలో జీతాలు
డైరక్టర్లతో సహా.. ఉద్యోగులకు రూ. 380 కోట్లను జీతాలుగా ఇచ్చింది జీరోదా. ముఖ్యంగా రూ. 623 కోట్లల్లో రూ. 236 కోట్లను ఈఎస్​ఓపీ (ఎంప్లాయీ స్టాక్​ ఓనర్​షిప2 ప్లాన్​) కోసం కేటాయించింది. బ్రోకరేజ్​ సంస్థగా జెరోధా వాల్యూ 3.6 బిలియన్​ డాలర్లుగా ఉంది. అంటే భారత కరెన్సీలో రూ. 30వేల కోట్లు. 2021లో ఇది 2 బిలియన్​ డాలర్లుగా ఉండేది. సంస్థ వాల్యూ అనతికాలంలో ఏకంగా 80శాతం వృద్ది చెందింది. 

'గ్రో'తో పోటీ..!
ఇటీవలి కాలంలో భారతీయుల్లో ఇన్​వెస్ట్​మెంట్స్​, ట్రేడింగ్​పై ఆసక్తి, అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలో డీమ్యాట్​ అకౌంట్​ ఓపెన్​ చేస్తూ, యాక్టివ్​గా ఉంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. జీరోదా ఆదాయానికి ఇది ఒక కారణమని తెలుస్తోంది. అయితే.. ఈ బ్రోకరేజ్​ ఇండస్ట్రీలో పోటీకూడా అదే విధంగా పెరుగుతోంది. జెరోధాకు ‘గ్రో’ అనే మరో స్టాక్​బ్రోకింగ్​ ప్లాట్​ఫామ్​ నుంచి గట్టిపోటీ ఎదురవుతోంది. 2023 సెప్టెంబర్​ నెల చివరికి.. జెరోధాలో 6.48 మిలియన్​ యాక్టివ్​ యూజర్స్​ ఉండగా.. గ్రో లో 6.63 మిలియన్​ మంది యాక్టివ్​గా ఉన్నారని డేటా చెబుతోంది.

>
మరిన్ని వార్తలు