హార్టికల్చర్‌లో యాంత్రికీకరణపై స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ దృష్టి 

20 Apr, 2022 08:34 IST|Sakshi

సంస్థ సీఈవో హరీశ్‌ చవాన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సాగు రంగంలో.. ప్రధానంగా హార్టికల్చర్‌ తదితర విభాగాల్లో వివిధ దశల్లో యాంత్రికీకరణకు తోడ్పడే ఉత్పత్తులపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్‌ డివిజన్‌ సీఈవో హరీశ్‌ చవాన్‌ తెలిపారు. ఇందులో భాగంగా కోడ్‌ పేరిట ఆవిష్కరించిన కొత్త ట్రాక్టరుకు భారీ స్పందన లభిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనికి కేవలం రెండు నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 500 పైచిలుకు, దేశవ్యాప్తంగా 2,700 పైగా బుకింగ్స్‌ వచ్చాయని మంగళవారమిక్కడ విలేకరులకు తెలిపారు.

డిమాండ్‌ను బట్టి వచ్చే మూడేళ్లలో ఈ కోవకి చెందే మరో రెండు, మూడు ఉత్పత్తులను ఆవిష్కరించనున్నట్లు చవాన్‌ తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 80 పైగా డీలర్ల ద్వారా విక్రయాలు సాగిస్తున్నట్లు చవాన్‌ చెప్పారు.  పరిశ్రమపరంగా చూస్తే కోవిడ్‌ వ్యాప్తి సమయంలో 2020–21లో ట్రాక్టర్ల విక్రయాలు సుమారు 26 శాతం పెరిగి దాదాపు తొమ్మిది లక్షల స్థాయిలో నమోదయ్యాయని, అ యితే గత ఆర్థిక సంవత్సరంలో స్వల్పంగా (దాదాపు 4–5%) మేర క్షీణించాయని తెలిపారు. ఇతర అంశాలతో పాటు కొంత అధిక బేస్‌ ప్రభావం ఇందుకు కారణమన్నారు.

ట్రాక్టర్ల విభాగంలో తమ గ్రూప్‌నకు దాదాపు 40 శాతం వాటా ఉందని చవాన్‌ చెప్పారు. సానుకూల వర్షపాత అంచనాల మధ్య ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ అమ్మకాలు ఆశావహంగా ఉండగలవని భావిస్తున్నట్లు వివరించారు. కీలక ముడివస్తువుల ధరలు పెరుగుతుండటంతో ఉత్పత్తుల రేట్లు పెంచక తప్పని పరిస్థితి ఉంటోందని పేర్కొన్నారు. తమ మొత్తం అమ్మకాల్లో ఏపీ, తెలంగాణ మార్కెట్ల వాటా 10 శాతం మేర ఉంటుందని, గత అయిదేళ్లలో 60,000 పైచిలుకు ట్రాక్టర్లు విక్రయించామని చవాన్‌ వివరించారు. 

చదవండి: అదరగొట్టిన ఎల్‌అండ్‌టీ ఇన్ఫోటెక్‌..మైండ్‌ట్రీతో విలీనంపై కీలక వ్యాఖ్యలు..!

మరిన్ని వార్తలు