సచివాలయాల ఉద్యోగులకు పదోన్నతులు

26 Aug, 2023 04:15 IST|Sakshi

కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా విలేజ్‌ హార్టికల్చర్‌ 

అసిస్టెంట్లు.. ఇప్పటికే పలువురి చేతికి పదోన్నతి పత్రాలు 

గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీల ఉద్యోగులు  

ఇందులో 17 కేటగిరీల పదోన్నతి చానల్‌ విధివిధానాలు ఖరారు 

తుది దశలో మిగతా రెండు కేటగిరీల విధివిధానాల ఖరారు 

పేరు కె.పూర్ణచంద్ర. నాలుగేళ్ల క్రితం అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు సచివాలయం గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. నెల క్రితం రాయచోటి మండలంలో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. 2019 ఉద్యోగ నియామక రాత పరీక్షలో సంబంధిత కేటగిరిలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో, ఉమ్మడి వైఎస్సార్‌ జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. 

పల్నాడు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం కోటప్పనగర్‌కు చెందిన పులి శ్రీధర్‌రెడ్డిది వ్యవసాయ కుటుంబ నేపథ్యం. 2019లో బొల్లాపల్లి మండలం వడ్డెంగుంటలో గ్రామ ఉద్యాన సహాయకుడిగా నియమితులయ్యారు. 20 రోజుల క్రితం తెనాలి హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. తాను పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్‌ వచ్చిందని, అప్పట్లో ఇవి పర్మినెంట్‌ ఉద్యోగాలు కావని కొందరు బెదరగొట్టారని శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకంతో దరఖాస్తు చేసుకోవడంతో మంచి జరిగిందన్నారు. తన భార్య కూడా గ్రామ ఉద్యాన సహాయకురాలిగా పనిచేస్తోందన్నారు. కాగా, అప్పట్లో ఇతను రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకు, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పదోన్నతులు పొందారు.  

సాక్షి, అమరావతి : నాలుగేళ్ల కిందట సచివాలయాల్లో గ్రామ ఉద్యాన అసిస్టెంట్‌ (విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్‌)గా నియామకమైన వారిలో కొందరు నెల కిత్రం అదే శాఖలో మండల స్థాయిలో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌గా పదోన్నతి పొందారు. కొత్త బాధ్యతల్లో చక్కగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో కేటగిరి–1 హార్టికల్చర్‌ ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 53 ఖాళీ ఉండగా, ఆ పోస్టులన్నింటినీ విలేజ్‌ హార్టికల్చర్‌ అసిస్టెంట్లతో భర్తీ చేసే ప్రక్రియను ఉద్యానవన శాఖ నెల రోజుల క్రితమే చేపట్టింది.

ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన.. శ్రీకాకుళం జిల్లాలో పది మంది, గుంటూరు జిల్లాలో ఒకరు, వైఎస్సార్‌ జిల్లాలో ఇద్దరు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ఇద్దరు చొప్పున నెల క్రితమే పదోన్నతులు పొందగా, మిగిలిన జిల్లాల్లోనూ 35 మందికి పదోన్నతుల ప్రక్రియ పురోగతిలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో మొత్తం 19 కేటగిరి ఉద్యోగులు పని చేస్తుండగా, అందులో 17 కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల ప్రక్రియకు సంబంధించిన విధివిధానాలను సైతం ప్రభుత్వం ఖరారు చేసింది.

అంటే.. ఆ 17 కేటగిరి గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించిన పదోన్నతులకు నిర్దేశించిన బాధ్యతల్లో ఖాళీలు ఏర్పడగానే, ఎప్పటికప్పుడు సచివాలయాల ఉద్యోగులకు అవకాశం దక్కుతుంది. మిగిలిన రెండు కేటగిరి ఉద్యోగుల పదోన్నతుల విధివిధానాల ఖరారు తుది దశలో ఉన్నట్టు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ అధికార వర్గాలు వెల్లడించాయి.   

మండల వ్యవస్థలో 13 ఏళ్లకు ఎంపీడీవో నియామకం 
నాలుగేళ్ల క్రితం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాల నియామకం చేపట్టినప్పుడు ఓర్వలేని ప్రతిపక్షాలు, కొన్ని పత్రికలు ఇవేవీ శాశ్వత ఉద్యోగాలు కావని, ప్రభుత్వం మారితే ఆ ఉద్యోగాలు ఊడతాయేమోనని భయపెట్టాయి. ఆ మాటలు నమ్మని నిరుద్యోగులు అప్పట్లో ఏకంగా 21 లక్షల మందికి పైగానే దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారిలో దాదాపు అందరూ ఏడాది కిందట ప్రొబేషన్‌ ఖరారు కూడా పూర్తి చేసుకొని అందరు ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే పే స్కేలుతో కూడిన వేతనం అందుకుంటున్నారు.

వీరిలో ఇంకొందరు మండల స్థాయిలో పని చేసేందుకు పదోన్నతులు కూడా పొందారు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1986లో మండల వ్యవస్థ ఏర్పాటైనప్పుడు ఆ మండలాల్లో పని చేసేందుకు ఉద్దేశించిన కీలక స్థాయి ఎంపీడీవోల ఉద్యోగాలకు తొలివిడత 13 ఏళ్ల తర్వాత 1999లో నియామకాలు జరిగాయి. ఆ తర్వాత ఎంపీడీవోలు పదోన్నతులు పొందడానికి సంబంధించిన సర్వీసు రూల్స్‌కు సైతం 2022 వరకు అతీగతీ లేదు. అప్పడు ఎంపీడీవోగా నేరుగా ఉద్యోగం పొందిన వారికి సైతం 23 ఏళ్ల తర్వాత గానీ పదోన్నతి దక్కలేదు. 

ఉద్యోగాల భర్తీ ఓ రికార్డు 
సీఎం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో కొత్తగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి, రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టించడం ఒక రికార్డు. ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వెనువెంటనే పూర్తి చేయడం మరో రికార్డు. ప్రభుత్వ స్థాయిలో ఒక కొత్త శాశ్వత పోస్టు మంజూరు చేయాలంటే నెలలు, ఏళ్లు పడుతుంది. కానీ, అధికారంలోకి వచ్చిన వెంటనే 1,34,524 కొత్త ఉద్యోగాలను ప్రభుత్వం మంజూరు చేయడం.. ఒకే విడతలో వాటి భర్తీకి నోటిఫికేషన్‌.. ఏకంగా 21,69,529 మంది దరఖాస్తు.. 35 రోజుల్లోనే రాత పరీక్షల నిర్వహణ.. ఆ తర్వాత 11 రోజులకే ఫలితాల వెల్లడి.. ఇలా అన్నీ చకచకా జరిగిపోయాయి. 

సమస్యల పరిష్కారంపై దృష్టి 
గ్రామ సచివాలయాల్లో పనిచేసే వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు సంబంధించి పదోన్నతుల ప్రక్రియకు విధివిధానాలు ఖరారు కావాల్సి ఉంది.   ఆయా శాఖల ఆధ్వర్యంలో అందుకు సంబంధించిన ప్రక్రియ తుది దశలో ఉంది. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో అంత పెద్ద సంఖ్యలో పని చేస్తున్న 1.34 లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆయా శాఖలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నాం.     
    – లక్ష్మీశ, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్‌   

మరిన్ని వార్తలు