వినియోగ ఉత్పత్తులకు మంచి డిమాండ్‌

15 Sep, 2023 01:19 IST|Sakshi

జనవరి–జూన్‌ మధ్య 8 శాతం వృద్ధి

జీఎఫ్‌కే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక

హైదరాబాద్‌: సాంకేతిక వినియోగ వస్తువుల రంగం ప్రస్తుత ఏడాది తొలి ఆరు నెలల్లో, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 8 శాతం వృద్ధి నమోదు చేసినట్టు జీఎఫ్‌కే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ తెలిపింది. స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ ఫోన్లతో కూడిన టెలికం ఉత్పత్తుల విభాగంలో అమ్మకాల పరిమాణం 4 శాతం తగ్గింది. విలువ పరంగా 12 శాతం పెరిగింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో, 2022లోని ఇదే కాలంతో పోలిస్తే కొన్ని రంగాలు గణనీయమైన వృద్ధిని చూశాయి.

‘‘భారత కన్జ్యూమర్‌ మార్కెట్‌ మారుతున్న వినియోగదారుల ప్రాధాన్యతలకు అనుగుణంగా పరిణామ క్రమంలో ఉంది. మార్కెట్లో వినూత్నమైన ఉత్పత్తులకు మంచి డిమాండ్‌ నెలకొంది. టెక్నికల్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌ మార్కెట్‌ విలువ పరంగా 8 శాతం చక్కని వృద్ధిని ప్రదర్శించింది. కన్జ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ రంగం (ఆడియో, వీడియో) 13 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేసింది’’అని జీఎఫ్‌కే మార్కెట్‌ నిపుణురాలు సౌమ్య ఛటర్జీ తెలిపారు. జీఎఫ్‌కే మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫ్‌లైన్‌ రిటైల్‌ ట్రాకింగ్‌ నివేదిక ప్రకారం..  

► స్మార్ట్‌ఫోన్లు, మొబైల్‌ ఫోన్లు మంచి పనితీరు చూపించాయి. విలువ పరంగా 12 శాతం అధికంగా అమ్మకాలు జరిగాయి. ఇందులో స్మార్ట్‌ఫోన్‌ విభాగం విలువ పరంగా 14 శాతం, పరిణామం పరంగా 3 శాతం వృద్దిని నమోదు చేసింది. ముఖ్యంగా రూ.30,000కు పైన ఉన్న స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల్లో 50 వృద్ధి కనిపించింది.   
► ప్రధాన గృహోపకరణాల విభాగం ఆశాజనకమైన పనితీరు చూపించింది. ఎయిర్‌ కండీషనర్లలో 7 శాతం వృద్ధి కనిపించింది. వాషింగ్‌ మెషిన్ల అమ్మకాలు 6 శాతం పెరిగాయి. మైక్రోవేవ్‌ ఓవెన్లు 4 శాతం అమ్మకాల వృద్ధిని చూశాయి.  
► మంచి వినోద అనుభవాన్ని భారత వినియోగదారులు కోరుకుంటున్నారు. దీంతో ఆడియో హోమ్‌ సిస్టమ్‌ల అమ్మకాలు 21 శాతం పెరిగాయి. పీటీవీ/ఫ్లాట్‌ టెలివిజన్ల అమ్మకాలు 13 శాతం అధికంగా నమోదయ్యాయి.  
► ఐటీ రంగంలో డెస్‌్కటాప్‌ కంప్యూటర్ల అమ్మకాలు 7 శాతం పెరిగాయి. మొబైల్‌ పీసీ విక్రయాలు 14 శాతం తగ్గాయి.  
► రిఫ్రిజిరేటర్ల విక్రయాలు 29 శాతం పెరిగాయి.

మరిన్ని వార్తలు