యూసేజ్‌ ఫీజు సహేతుకమే

28 Feb, 2023 01:07 IST|Sakshi

ఓటీటీలకు టెల్కోల స్పష్టీకరణ

న్యూఢిల్లీ: యూసేజీ ఫీజు అంశంపై ఓటీటీ కమ్యూనికేషన్‌ సర్వీస్‌ సంస్థలు, టెల్కోల మధ్య వివాదం కొనసాగుతోంది. తాజాగా ఓటీటీ సంస్థలు యూసేజీ ఫీజు కట్టాలంటూ తాము చేస్తున్న డిమాండ్‌ ’సముచితమైనది, సహేతుకమైనదే’ అని టెలికం సంస్థల సమాఖ్య సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌పీ కొచర్‌ స్పష్టం చేశారు. ఇది ఎకానమీ వృద్ధికి దోహదపడుతూనే డిజిటల్‌ ఇన్‌ఫ్రాను మెరుగుపర్చుకునేందుకు కూడా తోడ్పడగలదని ఆయన పేర్కొన్నారు.

టెలికం సేవల వినియోగం ద్వారా యూజర్లను పొందుతున్నందున తమకు ఆదాయంలో వాటా ఇవ్వాలంటూ టెల్కోలు కోరడాన్ని ఇంటర్నెట్‌ అండ్‌ మొబైల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఏఐఎంఏఐ) తప్పుపట్టిన సంగతి తెలిసిందే. ఇది నెట్‌ న్యూట్రాలిటీ విధానానికి విరుద్ధమని ఏఐఎంఏఐ ఆక్షేపించింది. ఈ నేపథ్యంలో కొచర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యూసేజీ ఫీజుల అంశాన్ని కొన్ని శక్తులు స్వలాభం కోసం పక్కదారి పట్టిస్తున్నాయని ఏఐఎంఏఐ పేరు ప్రస్తావించకుండా సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కొచర్‌ వ్యాఖ్యానించారు.

లైసెన్సింగ్‌ నిబంధనల ప్రకారం టెల్కోలన్నీ నెట్‌ న్యూట్రాలిటీకి (ఇంటర్నెట్‌ సేవలందించడంలో పక్షపాతం చూపకుండా తటస్థంగా ఉండటం) కట్టుబడి ఉన్నా యని ఆయన స్పష్టం చేశారు. టెలికం సంస్థలు మౌలిక సదుపాయాలు, స్పెక్ట్రం కోసం భారీగా వెచ్చిస్తాయని, రకరకాల పన్నులు చెల్లిస్తాయని, నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సి ఉంటుందని కొచర్‌ చెప్పారు. దానికి విరుద్ధంగా భారీ విదేశీ కంపెనీలు నిర్వహించే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు టెల్కోల నెట్‌వర్క్‌ ఉచితంగా వాడుకుంటూ, యూజర్లను పెంచుకుని, ప్రకటనల ద్వారా ప్రత్యక్షంగా.. పరోక్షంగా లబ్ధి పొందుతున్నాయని ఆయన తెలిపారు. ఆయా ప్లాట్‌ఫాంలు ప్రస్తుతం టెలికం చట్ట పరిధిలో లేనందున ఆదాయాలపై భారత్‌లో పన్నులు కట్టే పరిస్థితి ఉండటం లేదని చెప్పారు.

మరిన్ని వార్తలు