భారత్‌లో ఎక్కువ రేంజ్ అందించే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు - ఈక్యూఎస్ 580 నుంచి ఆట్టో 3 వరకు..

5 Jun, 2023 20:42 IST|Sakshi

Top 5 Electric Cars: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల వినియోగం ఎక్కువవుతోంది. దీనికి కారణం పెరుగుతున్న ఇంధన ధరలు కావచ్చు.. లేదా వాతావరణ సమతుల్యతను కాపాడటం కోసం కావచ్చు. కారణం ఏదైనా ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వినియోగం రెండూ పెరుగుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అయితే చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసే కస్టమర్లు అధిక రేంజ్ ఇచ్చే కార్లను ఎంపిక చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన దేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లు ఏవి? అవి అందించే రేంజ్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మెర్సిడెస్ బెంజ్ ఈక్యూఎస్ 580 (Mercedes-Benz EQS 580)
ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్ల జాబితాలో మెర్సిడెస్ బెంజ్ కంపెనీకి చెందిన 'ఈక్యూఎస్ 580' ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 857 కిమీ పరిధిని అందిస్తుందని కంపెనీ ధ్రువీకరించింది. సుమారు రూ. 1.55 కోట్లు విలువైన ఈ కారు 107.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి కేవలం 4.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. దీని గరిష్ట వేగం గంటకు 210 కిమీ వరకు ఉంటుంది.

కియా ఈవీ6 (Kia EV6)
ఇండియన్ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కియా మోటార్స్ కంపెనీకి చెందిన ఈవీ6 ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా ఉంది. ఇది ఒక సింగిల్ ఛార్జ్‌తో గరిష్టంగా 708 కిమీ పరిధిని అందిస్తుంది. రూ. 60 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన ఈ కారు 77.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 350 kW డీసీ ఛార్జర్ ద్వారా కేవలం 18 నిమిషాల్లో 80 శాతం ఛార్జ్ చేసుకోగలదు. 

హ్యుందాయ్ ఐయోనిక్ 5 (Hyundai Ioniq 5)
2023 ఆటో ఎక్స్‌పోలో విడుదలైన ఈ కారు ఒక ఛార్జ్‌తో గరిష్టంగా 631 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. సుమారు రూ. 45 లక్షల ధర వద్ద విడుదలైన ఈ కారు మంది డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ పొందుతుంది. 72.6 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 217 hp పవర్ 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ధర పరంగా ఇది కియా ఈవీ6 కంటే తక్కువగానే ఉంటుంది.

బీఎండబ్ల్యూ ఐ7 (BMW i7)
బీఎండబ్ల్యూ కంపెనీకి చెందిన ఐ7 కూడా మన జాబితాలో ఎక్కువ రేంజ్ అందించే ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. సుమారు రూ. 1.95 కోట్ల ధర కలిగిన ఈ కారు ఒక ఛార్జ్‌తో 625 కిమీ రేంజ్ అందిస్తుంది. 101.7 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ఈ కారు 539 bhp పవర్ 745 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 4.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు గరిష్ట వేగం గంటకు 239 కిలోమీటర్లు.

(ఇదీ చదవండి: యూపీఐ నుంచి పొరపాటున వేరే వారికి డబ్బు పంపించారా? ఇలా చేస్తే మళ్ళీ వస్తాయ్..)

బివైడి ఆట్టో 3 (BYD Atto 3)
భారతీయ మార్కెట్లో గత కొన్ని రోజులకు ముందు విడుదలైన 'బివైడి ఆట్టో 3' ఎలక్ట్రిక్ కారు ఒక ఛార్జ్‌తో 521 కిమీ పరిధిని అందిస్తాయి. రూ. 33.99 లక్షల ధర వద్ద లభించే ఈ కారు 60.48 కిలోవాట్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఇది 7.3 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 201 hp పవర్ 310 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది.

(ఇదీ చదవండి: దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ డ్రైవింగ్ కారు - టెక్నాలజీలో భళా భారత్)

భారతీయ మార్కెట్లో కేవలం ఈ కార్లు మాత్రమే కాకుండా బీఎండబ్ల్యూ ఐ4, ఆడి ఈ-ట్రాన్ జిటి, ఆడి ఈ-ట్రాన్, పోర్స్చే టైకాన్, జాగ్వార్ ఐ-పేస్, టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ మొదలైనవి కూడా ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి.

మరిన్ని వార్తలు