భారీగా తగ్గిన ద్విచక్ర వాహన విక్రయాలు

4 May, 2021 14:05 IST|Sakshi

స్థానిక లాక్‌డౌన్‌లతో అమ్మకాలపై ప్రభావం

ముంబై: లాక్‌డౌన్‌ తరహా ఆంక్షల విధింపుతో ఏప్రిల్‌లో మోటార్‌ సైకిల్, స్కూటర్‌ విక్రయాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. రెండో దశలో విజృంభిస్తున్న కరోనా కేసుల కట్టడికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఏప్రిల్‌లో స్థానిక లాక్‌డౌన్లను విధించాయి. దీంతో వాహనాల ఉత్పత్తి నెమ్మదించింది. సరఫరా అవాంతరాలు నెలకొని అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. దేశవ్యాప్త సంపూర్ణ లాక్‌డౌన్‌ విధింపుతో గతేడాది ఏప్రిల్‌లో వాహన కంపెనీలేవీ విక్రయాలు జరపలేదు. అందువల్ల నాటి అమ్మకాలతో ఈ ఏప్రిల్‌ విక్రయాలను పోల్చిచూడలేమని ద్విచక్ర వాహన కంపెనీలు చెప్పుకొచ్చాయి. 

కావున ఈ ఏడాది మార్చి అమ్మకాలతో పోల్చిచూడగా.., టూ-వీలర్స్‌ మార్కెట్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ ఏప్రిల్‌లో మొత్తం 3.72 లక్షల వాహనాలను విక్రయించింది. ఈ మార్చిలో అమ్మిన 5.76 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 35 శాతం తక్కువ. గత మార్చిలో 4.11 లక్షల వాహనాలకు విక్రయించిన హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా ఈ ఏప్రిల్‌లో 2.83 లక్షల యూనిట్లుకు పరిమితమైంది. అంటే మాస ప్రాతిపదికన 31 శాతం క్షీణత కనబరిచినట్లైంది. ఇదే ఏప్రిల్‌లో బజాజ్‌ ఆటో 1.34 లక్షల యూనిట్లను విక్రయించగా, మార్చిలో 3.88 లక్షల వాహనాలకు అమ్మింది. 

చదవండి:

స్థానిక లాక్‌డౌన్‌లతో 70 లక్షలకు పైగా ఉద్యోగాల కోత

మరిన్ని వార్తలు