India: కొండ దిగిన బంగారం

26 Feb, 2022 04:01 IST|Sakshi

యుద్ధం దీర్ఘకాలం సాగదన్న అంచనా నేపథ్యం

Russia-Ukraine crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంతో ‘రయ్‌’ మంటూ పైకి లేచిన బంగారం, క్రూడ్‌ వంటి కీలక కమోడిటీల ధరలు శుక్రవారం కొంత శాంతించాయి. యుద్ధంలో నాటో జోక్యం చేసుకోదన్న స్పష్టమైన సంకేతాలు, ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమన్న రష్యా ప్రకటన వంటి అంశాలు దీనికి నేపథ్యం. ఈ వార్త రాస్తున్న రాత్రి 10 గంటల సమయంలో  అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌లో ఔన్స్‌ (31.1గ్రా) పసిడి ధర క్రితం ముగింపుతో పోల్చితే 38 డాలర్ల నష్టంతో 1,888 వద్ద ట్రేడవుతోంది. యుద్ధం ప్రారంభంలో పసిడి ధర గురువారం అంతర్జాతీయంగా  ట్రేడింగ్‌ ఒక దశలో 1976 డాలర్ల స్థాయిని కూడా తాకటం గమనార్హం. అంటే తాజా హై నుంచి దాదాపు 100 డాలర్లు పడిపోయింది.  

దేశీయంగా రూ. 2,000 డౌన్‌
ఇక దేశీయంగా చూస్తే, మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో (ఎంసీఎక్స్‌)లో ధర క్రితం ముగింపుతో పో ల్చితే రూ.1,339 నష్టంతో రూ.50,204 వద్ద ట్రేడ వుతోంది.  దేశీయ ప్రధాన ముంబై స్పాట్‌ మార్కెట్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం క్రితం ముగింపుతో పోల్చితే 99.9 స్వచ్ఛత రూ.1,873 తగ్గి రూ.50,667 వద్ద ముగిసింది. 99.5 స్వచ్ఛత ధర రూ.1,866 దిగివచ్చి రూ.50,464కి చేరింది. వెండి కేజీ ధర రూ. 2,975 దిగివచ్చి రూ.65,174 వద్దకు దిగివచ్చింది. ఇక క్రూడ్‌ ధరలు కూడా అంతర్జాతీయంగా గురువారం ముగింపుతో పోల్చితే 2% నష్టంతో ట్రేడవుతున్నాయి. డాలర్‌ ఇండెక్స్‌ అరశాతం నష్టంతో 96.50 వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో ఫారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 27 పైసలు లాభపడి, 75.33 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు