విద్యార్థులను తరలించేందుకు  గ్రీన్‌ చానల్‌!

26 Feb, 2022 04:03 IST|Sakshi
ఎట్టకేలకు ఊరట: బస్సు ఎక్కడానికి వచ్చిన భారతీయ విద్యార్థుల ఆనందం.. 

‘సాక్షి’కి తెలిపిన విద్యార్థులు.. రష్యా, ఉక్రెయిన్‌లతో కేంద్రం చర్చలు

సాక్షి, హైదరాబాద్‌: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత విద్యార్థు లను ప్రత్యేక బస్సుల్లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు తీసుకెళ్లి.. ఇతర దేశాల మీదుగా భారత్‌కు తరలిం చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జెఫరోజియా, కీవ్, ఇతర ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది, వారిని ఎలా తరలించాలన్న దానిపై సమాలోచ నలు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత ఎంబసీ అధికారులు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారని ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు తెలిపారు. దీనికి సంబంధించి ‘సాక్షి’ ప్రతినిధులకు వివరాలు వెల్లడించారు.

విమానాలు నిలిపేయడంతో..
ఉక్రెయిన్‌కు చెందిన పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా అధీనంలోకి వెళ్లాయి. ఆ దేశ రాజధాని కీవ్‌ నగరానికి సమీపంలోకి రష్యా దళాలు చేరినట్టు వార్తలు వచ్చాయి. దీంతో అన్ని ప్రాంతాల్లోనూ విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయని అక్క డున్న తెలుగు విద్యార్థులు తెలిపారు. ‘‘భారత విద్యార్థులను ఉక్రెయిన్‌ సరిహద్దులకు తరలించ డంపై రష్యా, భారత్, ఉక్రెయిన్‌ అధికారుల మధ్య చర్చలు జరిగాయని భారత ఎంబసీ, యూని వర్సిటీ అధికారులు చెప్పారు. విమానాశ్రయాలన్నీ మూతపడటంతో రోడ్డు మార్గంలో సరిహద్దులకు తరలించాలని నిర్ణయించామన్నారు.

ఈ మేరకు ప్రత్యేకంగా గ్రీన్‌చానల్‌ ఏర్పాటు ప్రతిపాదనకు అంగీకారం కుదిరిందని వివరించారు. విద్యార్థు లను ప్రత్యేక బస్సుల ద్వారా రుమేనియా, హంగరీ, ఇతర దేశాల సరిహద్దులకు చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆ మార్గంలో ప్రయాణిం చేప్పుడు.. ముందుగానే ఉక్రెయిన్, రష్యా భద్రతా బలగాలకు, చెక్‌పోస్టులకు సమాచారం అందిస్తా రని, బస్సులపై భారత త్రివర్ణ పతకాన్ని ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కడా, ఎవరూ ఆపకుండా ప్రయాణించేలా (గ్రీన్‌ చానల్‌) చూస్తామని ఎంబసీ అధికారులు చెప్పారు. ఎవరూ ఎలాంటి దాడులకు పాల్పడే అవకాశం ఉండదని, క్షేమంగా భారత్‌కు తీసుకెళ్తామని భరోసా ఇచ్చారు..’’ అని విద్యార్థులు వివరించారు. తాము సమాచారం ఇచ్చేవరకు ఎవరూ బయటికి రావొద్దని, ప్రయాణానికి అవసర మైన డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారని వెల్లడించారు.

చదువేమైపోతుందో?
ఉక్రెయిన్‌లో చదువుతున్న తెలుగు విద్యార్థుల్లో చాలా మంది వైద్య విద్య (ఎంబీబీఎస్‌) అభ్యసిస్తు న్నారు. అందులో వందల మంది ఫైనలియర్‌లో ఉన్నారు. కొద్దిరోజులైతే పరీక్షలు కూడా పూర్తయి ఎంబీబీఎస్‌ పట్టాతో తిరిగివచ్చేవారు. నాలుగో ఏడాది చదువుతున్నవారికి కూడా ఒక్క ఏడాదైతే వైద్య విద్య చదువు పూర్తయ్యేది.

ఇప్పుడు వారంతా తమ చదువు ఏమైపోతుందోనన్న ఆందోళనలో పడ్డారు. ముఖ్యంగా ఫైనలియర్‌ వారైతే.. ఇప్పుడు ఇండియాకు తిరిగి వెళ్దామా, ఎలాగోలా కొంత కాలం ఉండి చదువు పూర్తి చేసుకుని, కల నెరవేర్చు కుందామా? అని తర్జనభర్జన పడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులేమో తమ వారికి ఏమైనా అయితే ఎలాగన్న ఆవేదన చెందుతున్నారు.

తక్కువ ఖర్చులో వైద్య విద్య కోసం..
ఉక్రెయిన్‌లో తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య విద్య అందుబాటులో ఉంది. అందుకే విదేశాల నుంచి చాలా మంది ఉక్రెయిన్‌కు వచ్చి చదువుకుం టుంటారు. ఈ క్రమంలోనే భారత్‌ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది ఉక్రెయిన్‌కు వెళ్లి ఎంబీబీ ఎస్‌ చేస్తున్నారు. ఇక్కడ నీట్‌లో మంచి ర్యాంకులు వచ్చినా ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య తక్కువ.

కన్వీనర్‌ కోటాలో సీట్లు దొరికితే సరి. మేనేజ్‌మెంట్‌ కోటాలో అయితే కోటి రూపాయలకుపైగా ఫీజులు వసూలు చేస్తున్నారు. అదే ఉక్రెయిన్‌లో సుమారు రూ.30 లక్షల్లోనే ఎంబీబీఎస్‌ పూర్తి చేయవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి 500 మందికిపైగా విద్యార్థులు ఎంబీబీఎస్‌ కోసం ఉక్రెయిన్‌ వెళ్తున్నారని వివరిస్తున్నారు.

వెంటాడుతున్న భయం
విద్యార్థులను రప్పించేందుకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నా ఇంకా భయం వెంటాడుతూనే ఉంది. భారత్‌కు క్షేమంగా చేరేవరకు పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన వెంటాడుతోందని తెలుగు విద్యార్థులు చెప్తున్నారు. ముఖ్యంగా ఉక్రె యిన్‌ రాజధాని కీవ్, పలు ఇతర నగరాల్లో దాడులు జరుగుతున్నాయని.. అక్కడి యూనివర్సిటీల్లో ఉన్నవారు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నా రని అంటున్నారు.

విశ్వవిద్యాలయాల్లోని బంకర్లలో తలదాచుకునేందుకు ఇతరులను కూడా అనుమతి స్తున్నారని, ఏమైనా సమస్యలు చెప్పుకోవడానికి అధికారులెవరూ అందుబాటులో ఉండటం లేదని కీవ్‌ ప్రాంతంలో చదువుతున్న విద్యార్థి సుకన్య తెలి పారు. ఇక జెఫరోజియా యూనివర్సిటీ ప్రాం తంలో ప్రస్తుతం ప్రమాదకర పరిస్థితులేమీ లేవని, కానీ భయం భయంగానే ఉందని నిజామాబాద్‌కు చెందిన విద్యార్థి స్వప్న తెలిపారు. తమను భారత్‌కు తరలించే ప్రక్రియ ప్రారంభమైందని యూనివర్సిటీ అధికారులు చెప్పారని వివరించారు. ఒకవేళ బస్సుల్లో ఎక్కినా రష్యా స్వాధీనంలోకి వెళ్తున్న ప్రాంతాల్లో ప్రయాణించడం ఆందోళనగానే అనిపిస్తోందని విద్యార్థి రాహుల్‌ వర్మ చెప్పారు.

కొంత ఊరట
మమ్మల్ని భారత్‌కు తరలించేందుకు జరుగు తున్న ప్రయత్నాలు ఊరట కలిగిస్తున్నాయి. సరిహద్దులకు వెళ్లాలంటే దాదాపు 800 కిలోమీటర్లు బస్సుల్లో ప్రయాణించాలి. ఇం దుకు కనీసం రెండు రోజులు పట్టే అవకాశ ముంది. ఏర్పాట్లు వేగంగా చేయాలని, త్వరగా తరలిం చాలని విద్యార్థులంతా కోరుతున్నారు.
– జోత్స్న భార్గవి, విద్యార్థిని

ఒకట్రెండు రోజులు గడిస్తేనే..
జెఫరోజియా వర్సిటీలో చదువుతున్న వాళ్లం దరం బంకర్లకు వెళ్తున్నాం. పరిస్థి తులు తీవ్ర రూపం దాల్చితే విదేశాలకు వెళ్లడం తప్ప మరో గత్యంతరం లేదు. భారత విద్యార్ధులను, ఉద్యోగులను బస్సుల్లో పోలాండ్, హంగేరీ, రొమేనియా దేశాలకు పంపేందుకు అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోరోజు గడిస్తే తప్ప ఏం జరుగుతుందో చెప్పలేం. డబ్బులు కూడా అయిపోవచ్చాయి.   

– వెంకటేశ్, జెఫరోజియా ఎంబీబీఎస్‌ విద్యార్ధి,

మరిన్ని వార్తలు