5జీకి ఎక్కువ చెల్లించడానికైనా రెడీ

29 Sep, 2022 04:37 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ యూజర్లపై ఎరిక్సన్‌ అధ్యయనం

న్యూఢిల్లీ: దేశీయంగా 5జీ రెడీ స్మార్ట్‌ఫోన్లు ఉన్న 10 కోట్ల మందికి పైగా యూజర్లు అత్యంత వేగవంతమైన సర్వీసుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీటి కోసం 45 శాతం వరకూ ఎక్కువ చెల్లించేందుకైనా సిద్ధంగా ఉన్నారు. ఎరిక్సన్‌ కన్జూమర్‌ల్యాబ్‌ రూపొందించిన ’5జీ హామీ’ అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది రెండో త్రైమాసికంలో దీన్ని నిర్వహించారు. 5జీ సర్వీసులకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైన నేపథ్యంలో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.

అత్యంత మెరుగైన ఏఆర్‌పీయూ (యూజరుపై సగటు ఆదాయం) ఆర్జించే అవకాశాలు దేశీయంగా టెల్కోలకు మరింత ఊతమివ్వగలవని నివేదిక పేర్కొంది. కంపెనీ లకు యూజర్లు కట్టుబడి ఉండాలంటే 5జీ నెట్‌వర్క్‌ పనితీరే కీలకంగా ఉంటుందని వివరించింది. సర్వీసులు ఎప్పుడు అందుబాటులోకి వస్తే అప్పుడు ఏ నెట్‌వర్క్‌ బాగుంటే దానికే మారిపోవాలని భావిస్తున్నట్లు సర్వేలో పాల్గొన్న వారిలో 36 శాతం మంది యూజర్లు తెలపడం ఇందుకు నిదర్శనం. మెరుగైన కవరేజీ కన్నా 5జీతో వినూత్నమైన కొత్త ఉపయోగాల గురించి ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం మంది పేర్కొన్నారు. ఇందుకోసం వారు ఆయా ప్లాన్ల కోసం 45 శాతం వరకూ ప్రీమియం చెల్లించేందు కైనా సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.  

నివేదికలోని మరిన్ని విశేషాలు..
► ఇప్పటికే 5జీ సేవలు అందుబాటులో ఉన్న బ్రిటన్, అమెరికాలతో పోలిస్తే కొత్త సర్వీసులకు అప్‌గ్రేడ్‌ అవ్వాలని భావిస్తున్న వారి సంఖ్య భారత నగరాల్లో రెండింతలు ఎక్కువగా ఉంది.

► రెండేళ్లలో 5జీ హ్యాండ్‌సెట్‌ వినియోగించే స్మార్ట్‌ఫోన్‌ యూజర్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. 5జీ రెడీ ఫోన్లు ఉన్న 10 కోట్ల మంది పైగా యూజర్లు 2023లో 5జీ సబ్‌స్క్రిప్షన్‌కు అప్‌గ్రేడ్‌ అయ్యే యోచనలో ఉన్నారు. వీరిలో సగం మంది వచ్చే 12 నెలల్లో మరింత ఎక్కువ డేటా ప్లాన్లకు మారాలని భావిస్తున్నారు.

► సేవల నాణ్యత, లభ్యతపై మరింతగా దృష్టి పెడుతూ మార్కెట్లో తమ స్థానాన్ని పటిష్టం చేసుకునేందుకు టెలికం సంస్థలకు ఇది మంచి అవకాశం కాగలదు. తొలినాళ్లలోనే 5జీ సేవలను ఎంచుకునే వారికి వినూత్నమైన అనుభూతిని అందించగలిగితే కంపెనీలు మరింతగా ఆర్జించే అవకాశాలు ఉంటాయి.

మరిన్ని వార్తలు