Omicron: ఒమిక్రాన్‌ పంజా..! మరో కీలక భేటీ వాయిదా...!

20 Dec, 2021 20:07 IST|Sakshi

కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. ఇప్పటికే 89 దేశాలకు ఒమిక్రాన్‌ వేరియంట్‌ పాకింది. ఈ కొత్త వేరియంట్‌ కారణంగా బ్రిటన్‌, యూరప్‌ దేశాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి.  దీంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ను ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే పలు అంతర్జాతీయ సమావేశాలకు ఆటంకం ఏర్పడింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై కొనసాగుతున్న అనిశ్చితి నేపథ్యంలో దావోస్‌లో జరగాల్సిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం వాయిదా పడింది. ఒమిక్రాన్‌ కారణంగా ఈ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ఫోరమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
 
వచ్చే ఏడాది జనవరి 17-21 మధ్య స్విట్జర్లాండ్‌లోని దావోస్-క్లోస్టర్స్‌లో  జరగాల్సిన వార్షిక సమావేశం వేసవి ప్రారంభంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.  వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశాలకు కఠినమైన ఆరోగ్య ప్రోటోకాల్స్‌ ఉన్నప్పటికీ, ఓమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండడంతో సమావేశాలను వాయిదా వేసినట్లు డబ్ల్యూఈఎఫ్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 


 
డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ ప్రొఫెసర్ క్లాస్ స్క్వాబ్ మాట్లాడుతూ...కోవిడ్‌-19 మహమ్మారిపై ప్రభుత్వాలు, ప్రైవేట్‌ సంస్థలు సమిష్టిగా పోరాడుతున్నాయని అభిప్రాయపడ్డారు. కాగా ఒమిక్రాన్‌ అలజడితో జెనీవాలో జరగాల్సిన డబ్య్లూటీవో మినిస్టీరియల్‌ (ఎంసీ12)య వాయిదా పడిన విషయం తెలిసిందే.

చదవండి: 4 Day Work Week: ఇకపై అందరికీ వారానికి నాలుగు రోజులపాటే పని...! కొత్త లేబర్‌కోడ్స్‌ అమలులోకి వస్తే..!

మరిన్ని వార్తలు