Jet Airways Founder Naresh Goyal Arrested : జెట్‌ ఎయిర్‌వేస్‌ : దేశంలోనే అత్యంత ధనవంతుడు.. చివరికి ఇలా కటకటాల పాలు

2 Sep, 2023 11:35 IST|Sakshi

చిన్న వయస్సులోనే తండ్రి మరణం..చదువుకునే స్థోమతా లేదు. ఒకపూట తింటే రెండో పూట పస్తులుండే జీవితం. అలాంటి దుర్భుర జీవితాన్ని అనుభవించిన ఓ యువకుడు దేశంలోనే అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌ జెట్‌ ఎయిర్‌ వేస్‌ అనే విమానయాన సంస్థను ఎలా స్థాపించగలిగారు. చిన్న వయస్సు నుంచే ‘నువ్వు మంచి చేస్తే మంచి... చెడు చేస్తే చెడు... తిరిగి మళ్ళీ అది నిన్నే చేరుతుంది’ అమ్మ మాటల్ని వింటూ పెరిగిన ఆయన ఆర్ధిక నేరానికి ఎందుకు పాల్పడ్డారు. వందల కోట్లలో తీసుకున్న బ్యాంకు లోన్లను ఎగ్గొట్టి పరారయ్యేందుకు ఎందుకు ప్రయత్నించారు. చివరికి ఎలా అరెస్ట్‌ అయ్యారు. 

జెట్‌ ఎయిర్‌వేస్‌ వ్యవస్థాపకుడు నరేశ్‌ గోయల్‌ అరెస్టు అయ్యారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) ప్రకారం.. కెనరా బ్యాంకుకు సంబంధించి రూ.538 కోట్ల మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆయనను అదుపులోకి తీసుకుంది.ఈ తరుణంలో భారతీయలు సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్న నరేశ్‌ గోయల్‌ కెరియర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌ గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ప్రయత్నిస్తున్నారు.  

బీకామ్‌తో సరిపెట్టుకుని
నరేశ్‌ గోయల్ 29 జూలై 1949 పంజాబ్‌లోని సంగ్రూర్‌ గ్రామంలో జన్మించారు. అదే గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో తన పాఠశాల విద్యాభ్యాసాన్ని, పంజాబ్‌లోని పాటియాలా ప్రభుత్వ బిక్రమ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుండి కామర్స్‌లో బ్యాచిలర్స్ పూర్తి చేశారు. అయితే 11 ఏళ్ల వయస్సుల్లో తన తండ్రి మరణం మరింత ఆర్ధిక ఇబ్బందుల్లోకి నెట్టింది. రుణం కారణంగా ప్రభుత్వం చిన్న తనంలో  గోయల్‌ ఇంటిని, ఇతర ఆస్తుల్ని వేలం పాట నిర్వహించింది. కాబట్టే చార్టెడ్‌ అకౌంటెంట్‌ పూర్తి చేయాలన్నా ఆయన కలలు.. కల్లలయ్యాయి. చదువుకునే స్థోమత లేక బీకామ్‌తో సరిపెట్టుకున్నారు. 

కఠిక నేలపై నిద్రిస్తూ 
1967లో గ్రాడ్యుయేషన్ తర్వాత, గోయల్ తన మేన మామ సేథ్ చరణ్ దాస్ రామ్ లాల్  ట్రావెల్ ఏజెన్సీ ఈస్ట్ వెస్ట్ ఏజెన్సీస్‌లో క్యాషియర్‌గా తన వృత్తిని ప్రారంభించారు. అదే ఆఫీస్‌నే ఇంటిగా మార్చుకున్నారు. పగలు ఆఫీస్‌ పనుల్ని చక్కబెడుతూనే.. రాత్రి వేళలో అదే ఆఫీస్‌లో నిద్రించే వారు. ఆఫీస్‌ అయిపోయిన వెంటనే అందులోనే స్నానం చేయడం.. పక్కనే ఉన్న దాబాలో సమయానికి ఏది దొరికితే అది తినడం, కఠిక నేలపై నిద్రించడం ఇలా రోజువారీ దినచర్యగా మారింది.

అనతి కాలంలో మేనేజర్‌ స్థాయికి
అనతి కాలంలో 1969లో ఇరాకీ ఎయిర్‌వేస్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్‌గా నియమితులయ్యారు. 1971 నుండి 1974 మధ్యకాలంలో రాయల్ జోర్డానియన్ ఎయిర్‌లైన్స్‌కు రీజినల్ మేనేజర్‌గా కూడా పనిచేశాడు. ఆ సమయంలో టిక్కెట్లు, రిజర్వేషన్, అమ్మకాల రంగాలలో అనుభవాన్ని గడించారు. ఆ అనుభవమే మిడిల్ ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్‌లోని భారతీయ అధికారులతో పనిచేసేందుకు ఉపయోగపడింది.  

తల్లి ఆశీర్వాదంతో
1967 నుండి 1974 వరకు, గోయల్‌ అనేక విదేశీ విమానయాన సంస్థలతో కలిసి పనిచేశారు. వ్యాపార మెళుకువల్ని నేర్చుకుని ఆ రంగంపై పట్టు సాధించారు. తనకున్న అనుభవంతో 1974లో నరేశ్‌ గోయల్‌ తన తల్లి నుంచి 500 డాలర్లు( రూ. 40వేలు) ఇప్పుడు (రూ.2లక్షలకు పైమాటే) వేల వరకు తీసుకున్నారు. ఆ డబ్బుతో తన సోదరుడు సురీందర్ కుమార్ గోయల్‌తో కలిసి తన సొంత స్టార్టప్ జైటర్‌ అనే ట్రావెల్ ఏజెన్సీని ప్రారంభించారు. సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో జైటర్‌ ఎయిర్ ఫ్రాన్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్,  కాథే పసిఫిక్ వంటి విమానయాన సంస్థలకు సేలందించేంది. వ్యాపారం జోరుగా కొనసాడంతో లాభాల్ని గడిస్తూ వచ్చారు.   

అంది వచ్చిన అవకాశం
అయితే 1991లో, నాటి భారత ప్రభుత్వం ఓపెన్ స్కైస్ పాలసీని ప్రకటించింది. ఆ ప్రకటనే నరేశ్‌ మరింత ఎత్తుకు ఎదిగేందుకు దోహదం చేసింది. గోయల్‌ ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. సొంతంగా తానే విమానయాన సంస్థను ప్రారంభించారు.1992లో అతని ట్రావెల్ ఏజెన్సీ జెట్ ఎయిర్‌వేస్‌గా పేరు మార్చారు. ఆ మరుసటి ఏడాది జెట్ ఎయిర్‌వేస్ దేశవ్యాప్తంగా తన కార్యకలాపాలను ప్రారంభించింది. 2004 నాటికి, జెట్ ఎయిర్‌వేస్ అంతర్జాతీయ విమానాల కార్యకలాపాలను ప్రారంభమయ్యాయి. 2007లో జెట్ ఎయిర్‌వేస్ ఎయిర్ సహారాను కొనుగోలు చేసింది. 2010 నాటికి భారతదేశంలో అతిపెద్ద ఏవియేషన్‌ సంస్థగా అవతరించింది. 

కొంపముంచిన అతి విశ్వాసం
కానీ రోజులు గడిచే కొద్దీ జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రాభవం మరింత తగ్గుతూ వచ్చింది. ఓవైపు అతి విశ్వాసం.. మరోవైపు మార్కెట్‌లో ఇతర ఏవియేషన్‌ సంస్థలు పుట్టుకురావడం, జెట్‌ ఎయిర్‌వేస్‌ విమాన టికెట్‌ ధరలు ఇతర ఏవియేషన్‌ కంపెనీ టికెట్ల ధరల కంటే ఎక్కువగా ఉండటం, వ్యాపారం కొనసాగించేందుకు అప్పులు చేయడం.. వాటికి వడ్డీలు చెల్లించడం, సిబ్బందికి జీతాలు ఇ‍వ్వలేక అక్రమ మార్గాన్ని ఎంచుకోవడంతో.. జెట్‌ ఎయిర్‌వేస్‌ పతనం ప్రారంభమైంది.  

నాలుగు పెద్ద సూట్కేసుల్ని తీసుకుని
2019లో ఎయిర్‌లైన్‌లో ఆర్థిక సంక్షోభంతో మూడింట రెండు వంతుల విమానాలు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఆయన మార్చి 25 ,2019న తన భార్య అనితా గోయల్‌తో కలిసి జెట్ ఎయిర్‌వేస్ బోర్డు నుండి వైదొలిగారు. అదే ఏడాది నాలుగు పెద్ద పెద్ద సూట్కేసులతో విదేశాలకు బయలుదేరి వెళ్లేందుకు నరేశ్‌ గోయల్, ఆయన సతీమణి అనితా గోయల్ ప్రయత్నించారు. ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు విమానం ఎక్కడానికి అనుమతి నిరాకరించడం అప్పట్లో పెద్ద ఎత్తున దుమారమే చెలరేగింది. 

సెప్టెంబరు 2019లో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గోయల్‌పై విదేశీ మారకద్రవ్య ఉల్లంఘన ఆరోపణలపై దర్యాప్తు కోసం ప్రశ్నించారు. 2020లో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

కెనరా బ్యాంక్‌ నుంచి రూ.538 కోట్లు రుణాలు ఎగవేతకు పాల్పడడం, తన అనుబంధ సంస్థ జేఐఎల్‌కు 14వందల కోట్ల చెల్లింపులు, పెట్టుబడులు పెట్టి తద్వారా భారీగా నిధుల్ని కాజేశారు. కెనరా బ్యాంక్‌ అధికారుల  ఫిర్యాదు, నిధులు కాజేయడంతో పాటు ఇతర ఆధారాల్ని సేకరించిన ఈడీ అధికారులు గోయల్‌ను ముంబై కార్యాలయంలో సుదీర్ఘంగా ప్రశ్నించించారు.  ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

వివాదాలు 
👉2000వ దశకంలో నరేష్‌గోయల్‌కు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంతో సంబంధాలున్నాయని ఆరోపిస్తూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. జెట్ ఎయిర్‌వేస్‌కు దావూద్ నిధులు సమకూర్చారని పిల్ పేర్కొంది. అయితే నరేష్ కు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇవ్వడంతో పాటు సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఇచ్చింది.

👉మార్చి 2020లో, అతనితో అనుబంధించబడిన 19 ప్రైవేట్ సంస్థలకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీలలో పాల్గొన్నందుకు ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ద్వారా మనీ లాండరింగ్ కేసు నమోదైంది. 

👉19 జూలై 2023న, నరేష్ గోయల్, అతని సహచరుల నివాసాల్లో ఢిల్లీ, ముంబైలలో దాడులు చేసింది. దీనికి ముందు, జూలై 14, 2023న  గోయల్, అతని భార్యతో పాటు ఇతరులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. చివరికి అదుపులోకి తీసుకుంది.  

👉1979లో మార్కెటింగ్ అనలిస్ట్‌గా కంపెనీలో చేరి మార్కెటింగ్, సేల్స్ హెడ్‌గా ఎదిగిన అనిత అనే యువతిని ఆమెను వివాహం చేసుకున్నారు.  వారు తొమ్మిదేళ్ల తర్వాత వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. 

👉చివరిగా ::: ఎయిర్‌ డెక్కన్‌ సంస్థను స్థాపించి అందరికీ తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యం అందించిన కెప్టెన్‌ గోపీనాథ్‌ జీవితంలోని అంశాల ఆధారంగా ఆకాశమే నీ హద్దురా సినిమా తెరకెక్కింది. ఆ సినిమాలో విమానయాన సంస్థ పెట్టడానికి ప్రయత్నించే యువకుడిగా కెప్టెన్‌ గోపీనాథ్‌ పాత్రను సూర్య చేస్తే.. సినిమాలోని సూర్య (మహా) ఆశయాన్ని ప్రతి అడుగులోను అడ్డగించే విలన్‌గా పరేష్‌ రావల్‌ యాక్ట్‌ చేశారు. నిజజీవితంలో కెప్టెన్‌ గోపీనాథ్‌ను ఇబ్బంది పెట్టింది మరెవరో కాదు జెట్‌ ఎయిర్‌ వేస్‌ అధినేత నరేశ్‌ గోయల్‌.

మరిన్ని వార్తలు