ఆర్బీఐ కీలక నిర్ణయం, ప్రముఖులు ఏమంటున్నారంటే!

5 May, 2022 07:49 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అనూహ్యరీతిలో వడ్డీరేట్ల షాక్‌ ఇచ్చింది. కీలకమైన రెపో రేటును 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ సందర్భంగా రెపోరేటు ఎందుకు పెంచుతున్నామనే కారణాల్ని ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వివరించారు.   

పెరుగుతున్న ద్రవ్యోల్బణం, భౌగోళిక–రాజకీయ ఉద్రిక్తతలు, అధిక ముడి చమురు ధరలు, ప్రపంచవ్యాప్తంగా వస్తువుల కొరత, సప్లై చైన్‌లో సమస్యలు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నాం.  

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెరిగిన వస్తువుల ధరల కారణంగా ద్రవ్యోల్బణానికి సంబంధించి ఎకానమీ అంతర్జాతీయంగా సవాళ్లను ఎదుర్కొంటోంది. ఆయా అంశాల పట్ల జాగరూకత అవసరం. ద్రవ్యోల్బణం సవాళ్లు కొనసాగే అవకాశం ఉంది.  

ఈ రోజు రెపో రేటును పెంచాలనే నిర్ణయం మే 2020 తరువాత తొలి ‘యూ’ టర్న్‌గా పరిగణించవచ్చు. గత నెలలో మేము సరళతర ద్రవ్య విధానాన్ని క్రమంగా ఉపసంహరించుకునే వైఖరిని వ్యక్తపరిచాము. ఆ చర్యకు అనుగుణంగానే నేటి చర్యను చూడాలి. 

ద్రవ్య విధాన చర్య ద్రవ్యోల్బణం పెరుగుదలను నియంత్రించడం, ద్రవ్యోల్బణ అంచనాలను అదుపులోనికి తేవడం లక్ష్యంగా ఉందని నేను స్పష్టం చేయదలచుకున్నాను. అధిక ద్రవ్యోల్బణం వృద్ధికి హానికరం. 

ఆగస్ట్‌ 2018 తర్వాత పాలసీ రేటును పెంచడం ఇదే మొదటిసారి. ఇది కార్పొరేట్‌లకు, వ్యక్తులకు రుణ వ్యయాలను పెంచే అవకాశం ఉంది. తాజా ఆశ్చర్యకరమైన పెంపు మే 2020నాటి కోవిడ్‌ సవాళ్లను ఎదుర్కొనడానికి తీసుకున్న పాలసీ చర్యకు (రేటును 4 శాతం కనిష్టానికి తగ్గించడం) భిన్నమైనది.  

ద్రవ్యోల్బణం లక్ష్యంలోనే ఉండేలా చూసుకోవడానికి  సరళతర ద్రవ్య విధానాన్ని ఉపసంహరించుకుంటూనే, అదే సమయంలో అవసరమైతే సరళతరం వైపు మొగ్గుచూపే అవకాశాలవైపు దృష్టి సారించడాన్ని ఆర్‌బీఐ కొనసాగిస్తుంది. 

దేశీయ సరఫరాల పరిస్థితి బాగున్నప్పటికీ,  అంతర్జాతీయంగా గోధుమల కొరత.. దేశీయ గోధుమ ధరలపై ప్రభావం చూపుతోంది. ఇది ద్రవ్యోల్బణం సవాళ్లను పెంచుతోంది.  
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, ఆంక్షల నేపథ్యంలో వంట నూనెల ధరలు పెరగవచ్చు. ఇటీవలి వాణిజ్య ఒప్పందాలు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు భారతదేశానికి మంచి మార్కెట్‌ అవకాశాలను తెస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల భౌగోళిక పరిస్థితుల్లోనూ భారత్‌ స్థిరంగా, సవాళ్లను తట్టుకోగలిగిన స్థాయిలో నిలబడుతోంది.

ద్రవ్యోల్బణంపై సీరియస్‌ 
ద్రవ్యోల్బణాన్ని ఆర్‌బీఐ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తాజా పాలసీ స్పష్టం చేస్తోంది. ద్రవ్యోల్బణం సమస్య వేళ్లూనుకునే పరిస్థితిని తలెత్తబోనీయమని  స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు దీనిని అర్థం చేసుకోవచ్చు. ఈ తరహా నిర్ణయం ఎకానమీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు బలాన్నిస్తుంది. తాజా నిర్ణయంతో బ్యాంకింగ్‌ డిపాజిట్, రుణ రేట్లు క్రమంగా పెరుగుతాయి. – ఉదయ్‌ కోటక్, ప్రముఖ బ్యాంకర్‌ 

హౌసింగ్‌కు ప్రతికూలమే... 
రెపో రేటు దిగువ స్థాయిలో ఉంటే, రియల్టీకి అది మేలు చేస్తుంది. మహమ్మారి సమయంలో సరళతర విధానం హౌసింగ్‌ రంగానికి సానుకూలత అందించింది. తాజా ఆర్‌బీఐ నిర్ణయం రియల్టీని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నిర్ణయం వినియోగదారుల కొనుగోలు శక్తిని తగ్గిస్తుంది. హౌసింగ్‌ డిమాండ్‌కు ఇది ప్రతికూలమే.
హర్ష్‌ వర్దన్‌ పటోడియా, క్రెడాయ్‌ ప్రెసిడెంట్‌ 

బిజినెస్‌ సెంటిమెంట్‌కు దెబ్బ 
రెపో రేటు, సీఆర్‌ఆర్‌ పెంపు ఒకవైపు బిజినెస్‌ సెంటిమెంట్‌ను, మరోవైపు కొనుగోలుదారు వినియోగ శక్తిని దెబ్బతీస్తుం ది. కరోనా వైరస్‌ ప్రభావాల నుంచి ఇప్పటికీ తేరుకోని ఎకానమీపై తాజా ఆర్‌బీఐ నిర్ణయం ప్రతికూల ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వ్యవస్థలో ఎటువంటి ద్రవ్య లభ్యతకు తగిన చర్యలు తీసుకుంటామన్న ఆర్‌బీఐ ప్రకటన హర్షణీయం.–ప్రదీప్‌ ముల్తానీ, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌ 

ఆటోకు బ్రేకులు... 
ఆటోమొబైల్‌ రంగంలో రుణాలు వ్యయభరితం అవుతాయి. అధిక వెయిటింగ్‌ పిరియడ్‌ వల్ల పాసింజర్‌ వాహన విక్రయాలపై తక్షణ ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, ద్విచక్ర వాహన రంగం మాత్రం రేటు పెంపు ప్రభావాన్ని ఎదుర్కొంటుంది. అధిక ఇంధన ధరలకుతోడు తాజా రెపో రేటు పెంపు ప్రభావం చూపుతాయి – వికేశ్, గులాటి, ఎఫ్‌ఏడీఏ ప్రెసిడెంట్‌

చదవండి👉నాలుగేళ్ల తర్వాత..ఆర్బీఐ భారీ షాక్‌!, సామాన్యులపై వడ్డీరేట్ల పిడుగు!

మరిన్ని వార్తలు