ప్రపంచ కుబేరుల జాబితాలో 'రతన్ టాటా' ఎందుకు లేరు - కారణం ఇదే!

26 Sep, 2023 15:46 IST|Sakshi

ప్రపంచం కుబేరుల జాబితాలోనే కాదు, భారతదేశంలోని టాప్ 10 ధనవంతుల లిస్ట్‌లో కూడా దేశీయ పారిశ్రామిక దిగ్గజం 'రతన్ టాటా' (Ratan Tata) పేరు ఎందుకు లేదనే సందేహం ఇప్పటికే చాలామంది మనసులో ఒక ప్రశ్నగా మిగిలి ఉంటుంది. ఈ కథనంలో ఆ ప్రశ్నకు సమాధానం తెలుసుకుందాం.

ఉప్పు నుంచి కార్లు, విమానం, బంగారం, ఐటీ వంటి అన్ని రంగాల్లోనూ తమదైన రీతిలో దూసుకెళ్తున్న టాటా సన్స్ కంపెనీ  చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన ఈయన సంపద వేల కోట్లలో ఉంటుంది. అయినప్పటికీ ధనవంతుల జాబితాలో ఈయన పేరు లేదు. దీనికి ప్రధాన కారణం ఎక్కువ డబ్బుని దాతృత్వానికి వినియోగించడమే.

అపారమైన వ్యాపార సామ్రాజ్యం, అంతకు మించిన పేరు ప్రతిష్టతలు కలిగిన రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు. కంపెనీ నుంచి వచ్చే ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. ఈ కారణంగానే టాప్ 10 ధనవంతుల జాబితాలో కూడా ఉండలేకపోతున్నారు.

ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రాపై కేసు నమోదు.. కారణం ఇదే!

2021 - 22లో టాటా కంపెనీల మొత్తం ఆదాయం 128 బిలియన్ డాలర్లు అని నివేదికలు చెబుతున్నాయి. టాటా సంస్థల్లో ఏకంగా 9,35,000 కంటే ఎక్కువమంది ఉద్యోగులు ఉన్నట్లు సమాచారం. కాగా రతన్ టాటా 2012లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.

మరిన్ని వార్తలు