Ban vs NZ: మాకు నీతులు చెప్పడం కాదు.. ముందు మీరు అద్దంలో చూసుకోండి: భారత మాజీ క్రికెటర్‌ ఫైర్‌

26 Sep, 2023 15:46 IST|Sakshi

Ban vs NZ 2nd ODI- So please don’t teach us: బంగ్లాదేశ్‌ తాత్కాలిక కెప్టెన్‌ లిటన్‌ దాస్‌పై టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా మండిపడ్డాడు. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో ఇష్‌ సోధి విషయంలో అతడు వ్యవహరించిన తీరును తప్పుబట్టాడు. ఇలాంటివి చేసి నువ్వేం నిరూపించాలనుకుంటున్నావంటూ ఘాటుగా విమర్శించాడు.

కాగా వన్డే వరల్డ్‌కప్‌-2023కి ముందు కివీస్‌ బంగ్లాదేశ్‌ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో వర్షం కారణంగా తొలి వన్డేలో ఫలితం తేలలేదు. ఇక ఢాకా వేదికగా శనివారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 86 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. 

బాల్‌ విసరకముందే క్రీజును వీడి
తద్వారా 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో వన్డే బంగ్లాదేశ్‌కు కీలకంగా మారింది. ఇదిలా ఉంటే.. రెండో వన్డేలో బంగ్లా బౌలర్‌ హసన్‌ మహ్మూద్‌ బంతి విసరకముందే నాన్‌ స్ట్రైకర్‌ ఇష్‌ సోధి క్రీజును వీడగా రనౌట్‌(మన్కడింగ్‌) చేసిన విషయం తెలిసిందే.

వెనక్కి పిలిచిన బంగ్లా కెప్టెన్‌
దీంతో ఇష్‌ సోధి తన బ్యాట్‌ను క్లాప్‌ చేస్తూ ముందుకు సాగాడు. అయితే, కెప్టెన్‌ లిటన్‌ దాస్‌ కలుగజేసుకుని సోధిని వెనక్కిపిలిచాడు. ఈ క్రమంలో బౌలర్‌ను హగ్‌ చేసుకున్నాడు కివీస్‌ ప్లేయర్‌ ఇష్‌ సోధి. ఆ సమయంలో 17 పరుగుల వద్ద ఉన్న అతడు.. 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లిటన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

ఇక సోధిని వెనక్కి పిలిపించిన వీడియో నెట్టింట వైరల్‌కాగా బంగ్లాదేశ్‌ క్రీడాస్ఫూర్తి అంటూ ప్రశంసలు కురిశాయి. ఈ విషయంపై తాజాగా స్పందించిన కామెంటేటర్‌ ఆకాశ్‌ చోప్రా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు.

మాకు నీతులు చెప్పడం ఆపండి
‘‘మీకేమైనా ప్రాబ్లం ఉందా? నాకైతే రెండు ఇష్యూస్‌ ఉన్నాయి. ఒకటి.. అసలు నువ్వు(బ్యాటర్‌) ముందుగానే క్రీజు ఎందుకు దాటావు? పాశ్చాత్య క్రికెట్‌ ప్రపంచం ఎల్లపు​డూ క్రీడాస్ఫూర్తి గురించి మాట్లాడుతూ ఉంటుంది కదా..

60కేఎంపీహెచ్‌ పరిమితి ఉన్న చోటు కూడా 120 కేఎంపీహెచ్‌తో బౌలింగ్‌ చేయడం.. తర్వాత పొరపాటుగా జరిగిపోయిందని బుకాయించడం. మీరు తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే కదా.. నిబంధనలు అందరికీ ఒకే విధంగా ఉంటాయి.

కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే. కాబట్టి ఇకపైనైనా మాకు నీతులు చెప్పడం మానేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి ముందు’’ అని ఆకాశ్‌ చోప్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు?
అదే విధంగా.. ‘‘ఫీల్డింగ్‌ టీమ్‌ కెప్టెన్‌ రనౌట్‌ అయిన ప్లేయర్‌ను వెనక్కి పిలవడమేమిటి? ఎవరో ఏదో అనుకుంటారని ఇలా చేస్తారా? అసలు నువ్వేం నిరూపించాలనుకుంటున్నావు? నిబంధనలకు వ్యతిరేకంగా వెళ్లడం క్రీడాస్ఫూర్తి అనిపించుకోదు. అర్థమైందా?’’ అని లిటన్‌ దాస్‌కు ఆకాశ్‌ చోప్రా చురకలు అంటించాడు.

కాగా గతంలో ఇదే తరహాలో క్రీజును ముందే వీడిన నాన్‌ స్ట్రైకర్‌ను టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అవుట్‌ చేసినపుడు, దీప్తి శర్మ ఇంగ్లండ్‌లో ఇలాగే రనౌట్‌ చేసినందుకు పాశ్చాత్య దేశాల క్రికెటర్లు మన్కడింగ్‌ క్రీడాస్ఫూర్తికి విరుద్ధం అంటూ గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. 

అయితే, కొంతకాలం క్రితం ఈ పదాన్ని తొలగిస్తూ ఇలా అవుట్‌ కావడం రనౌట్‌ కిందకే వస్తుందని ఐసీసీ స్పష్టం చేసింది. అయినప్పటికీ తాను అవుట్‌ కాగానే సోధి బ్యాట్‌ను క్లాప్‌ చేయడం, లిటన్‌ దాస్‌ అతడిని వెనక్కిపిలిపించడం వంటి విషయాలు ఆకాశ్‌ చోప్రాకు ఆగ్రహం తెప్పించడంలో తప్పులేదు.

మరిన్ని వార్తలు