విప్రో లాభం ఫ్లాట్‌

19 Oct, 2023 06:29 IST|Sakshi

న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం విప్రో లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023–24) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్‌ (క్యూ2)లో నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ. 2,667 కోట్లను తాకింది. గతేడాది(2022–23) ఇదే కాలంలో రూ. 2,649 కోట్లు ఆర్జించింది.

మొత్తం ఆదాయం నామమాత్ర క్షీణతతో రూ. 22,516 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,540 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. ఐదు అనుబంధ సంస్థలను కంపెనీలో విలీనం చేసుకునేందుకు బోర్డు అనుమతించినట్లు విప్రో తాజాగా వెల్లడించింది. వీటిలో విప్రో హెచ్‌ఆర్, ఓవర్‌సీస్‌ ఐటీ, టెక్నాలజీ ప్రొడక్టు సరీ్వసులు, వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ సరీ్వసులు, విప్రో ట్రేడ్‌మార్క్‌ హోల్డింగ్‌ ఉన్నాయి.   

గైడెన్స్‌ వీక్‌..
ప్రస్తుత త్రైమాసికం(అక్టోబర్‌–డిసెంబర్‌)క్యూ3లో ఐటీ సర్వీసుల ఆదాయం 3.5–1.5 శాతం మధ్య క్షీణించవచ్చంటూ విప్రో తాజా అంచనాల(గైడెన్స్‌)ను ప్రకటించింది. వెరసి కరెన్సీ నిలకడ ప్రాతిపదికన 261.7–267.2 కోట్ల డాలర్ల స్థాయిలో ఆదాయాన్ని ఊహిస్తోంది. అంటే రూ. 21,643–22,097 కోట్ల మధ్య టర్నోవర్‌ను అంచనా కట్టింది. ప్రస్తుత బలహీన ప్రపంచ ఆర్థిక ఔట్‌లుక్‌ నేపథ్యంలో తాజా గైడెన్స్‌ను ప్రకటించింది.

ఇతర విశేషాలు
► నిర్వహణ మార్జిన్లు నామమాత్ర వృద్ధితో 16.1 శాతానికి చేరాయి.
► 3.78 బిలియన్‌ డాలర్ల విలువైన కాంట్రాక్టులను కుదుర్చుకుంది.
► క్యూ2కల్లా సిబ్బంది సంఖ్య 7 శాతం తగ్గి 2,44,707కు చేరింది.  
► ఉద్యోగ వలసల(అట్రిషన్‌) రేటు గత 6 త్రైమాసికాల్లోనే తక్కువగా 15.5%కి పరిమితమైంది.

అనిశి్చతులు ఉన్నాయ్‌...
బిజినెస్‌ వాతావరణం అనిశి్చతిగా ఉన్నట్లు ఫలితాల విడుదల సందర్భంగా విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్‌ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు గరిష్టస్థాయిలలో కొనసాగుతున్నాయని, పెట్టుబడులపట్ల క్లయింట్లు మరింత కఠిన వైఖరిని ప్రదర్శిస్తున్నారని తెలియజేశారు. ప్రస్తుత పెట్టుబడుల గరిష్ట వినియోగంపై దృష్టి పెడుతూనే కొత్త పెట్టుబడులపై వేగవంత రిటర్నులను ఆశిస్తున్నట్లు వివరించారు. విచక్షణా వ్యయాలు, ఆర్డర్లు నెమ్మదిస్తున్నట్లు వెల్లడించారు. ఇది ఆదాయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నట్లు తెలియజేశారు. అయితే మార్జిన్లు నిలుపుకుంటున్నట్లు పేర్కొన్నారు.  

ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నీరసించి రూ. 408 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు