ఏనాడూ వ్యవసాయ భూమి కొనలేదు: ఆర్ఐఎల్‌

4 Jan, 2021 12:47 IST|Sakshi

రైతులతో కాంట్రాక్ట్‌ వ్యవసాయాన్ని చేయలేదు

మద్దతు ధరలకు అనుగుణంగానే వ్యవసాయోత్పత్తుల కొనుగోలు

ఒక ప్రకటనలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వెల్లడి

ముంబై: కార్పొరేట్ అవసరాల కోసం ఏనాడూ వ్యవసాయ భూములను కొనుగోలు చేయలేదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఇదే విధంగా రైతులతో కాంట్రాక్ట్‌ వ్యవసాయానికి ఎలాంటి ఒప్పందాలూ కుదుర్చుకోలేదని తెలియజేసింది. భవిష్యత్‌లోనూ కాంట్రాక్ట్‌ లేదా కార్పొరేట్‌ వ్యవసాయం చేసే ప్రణాళికలు లేవని తేల్చిచెప్పింది. తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటనలో ఆర్‌ఐఎల్‌ ఇంకా ఏమన్నదంటే.. 

ఎంఎస్‌పీకి అనుగుణంగా
అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్‌ ఏనాడూ రైతుల నుంచి ఆహార ధాన్యాలను ప్రత్యక్షంగా కొనుగోలు చేయలేదు. కనీస మద్దతు ధర(ఎంఎస్‌పీ) లేదా ఏ ఇతర మార్గదర్శకాలకు అనుగుణమైన విధానాలలోనే వ్యవసాయోత్పత్తులను కొనుగోలు చేయవలసిందిగా సరఫరాదారులందరికీ స్పష్టం చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన ధరల విధానంలో మాత్రమే వ్యవసాయోత్పత్తులను సమకూర్చవలసిందిగా సరఫరాదారులకు తగిన ఆదేశాలు జారీ చేసింది. రైతులకు నష్టం చేసే రీతిలో లేదా కంపెనీకి అనుచిత లబ్ది చేకూరే విధానంలో ఏనాడూ దీర్ఘకాలిక కాంట్రాక్టులను కుదుర్చుకోవడం వంటివి చేపట్టలేదు. 

కోర్టులో పిటిషన్‌
ఇటీవల కొద్ది రోజులుగా పంజాబ్‌, హర్యానాలలో రిలయన్స్‌ జియోకు చెందిన సుమారు 1,500 మొబైల్‌ టవర్లకు కొంతమంది నష్టం చేకూర్చినట్లు అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో ద్వారా పంజాబ్‌, హర్యానా హైకోర్టులో ఆర్‌ఐఎల్‌ ఫిర్యాదు చేసింది. కొత్త చట్టాలకు వ్యతిరేకంగా ఇటీవల రైతులు చేపట్టిన నిరసనల నేపథ్యంలో కావాలని కొంతమంది కంపెనీ ఆస్తులకు నష్టం కలిగిస్తున్నట్లు ఆరోపించింది. తద్వారా వేలకొద్దీ ఉద్యోగులకు రక్షణ కరవుకాగా, కీలక మౌలికసదుపాయాలకు విఘాతం కలుగుతున్నట్లు తెలియజేసింది. కంపెనీ ఉద్యోగులు, ఆస్తులకు వెంటనే తగిన రక్షణ కల్పించవలసిందిగా ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించింది. కంపెనీ ఆస్తుల విధ్వంసాన్ని కొన్ని వ్యాపార వైరివర్గాలు కావాలని చేస్తున్న దుశ్చర్యలుగా ఫిర్యాదులో ఆరోపించింది.

మరిన్ని వార్తలు