షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ జరిమానా..?

31 Dec, 2021 19:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ తయారీదారులకు షావోమీ, ఒప్పో కంపెనీలకు ఐటీ శాఖ భారీ షాక్‌ ఇచ్చింది. ఐటీ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను షావోమీ, ఒప్పో కంపెనీలపై ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని ఆదాయపు పన్ను శాఖ నేడు తెలిపింది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఢిల్లీలోని షావోమీ, ఒప్పో, వన్ ప్లస్ కార్యాలయాలలో ఆదాయపు పన్ను(IT) శాఖ డిసెంబర్ 21న తనిఖీలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ సంస్థల కార్యాలయాల్లో తనిఖీల చేసే సమయంలో ఆ కంపెనీ అధికారులను ఐటీ అధికారులు ప్రశ్నించారు. ఆ కంపెనీ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. షావోమీ, ఒప్పో కంపెనీలు రాయల్టీ రూపంలో విదేశాలలో ఉన్న వాటి గ్రూపు కంపెనీలకు ₹5,500 కోట్లకు పైగా ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు పన్ను శాఖ ఈ రోజు ఒక ప్రకటనలో తెలిపింది. "తమ అనుబంధ సంస్థలతో లావాదేవీలు చేసేటప్పుడు ఆదాయపు పన్ను చట్టం, 1961 సూచించిన ఆదేశాలను ఈ కంపెనీలు పాటించలేదు. అందుకే, ఈ కంపెనీల మీద ₹1,000 కోట్లకు పైగా జరిమానాను విధించవచ్చని" ఐటీ శాఖ ప్రకటనలో తెలిపింది.

(చదవండి: పెన్షన్ తీసుకునే వారికి కేంద్రం శుభవార్త..!)

మరిన్ని వార్తలు