పబ్‌జీ ముసుగులో బాలికపై దారుణం

15 Oct, 2020 18:48 IST|Sakshi

బాలికపై  ముగ్గురు యువకుల వరుస అత్యాచార పర్వం

వీడియో తీసి బ్లాక్ మెయిల్

భోపాల్: ఆన్‌లైన్‌ గేమ్ ముసుగులో మధ్యప్రదేశ్ లో చోటుచేసుకున్న దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్‌లో పరిచయమైన అమ్మాయిని (12) మభ్యపెట్టి లైంగికంగా దాడి చేయడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి,  పదేపదే అత్యాచారం చేసిన ఉదంతం కలకలం రేపింది. పబ్‌జీ గేమ్  ద్వారా పరిచయమైన ముగ్గురు  యువకులు ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు.

పోలీసులు అందించిన సమాచారం ప్రకారం పబ్‌జీ గేమ్ పేరుతో బాలికతో ఆన్‌లైన్‌లో స్నేహం నటించారు. ఈ క్రమంలో గత నెలలో, నిందితులు బాలికను రంభ నగర్ కు ఆహ్వానించి ఆమెపై అత్యాచారం చేశారు. దాన్ని వీడియో తీశారు. అనంతరం ఎవరికైనా చెబితే ఈ వీడియోను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తామని బెదిరించి మరీ ఆమెపై పలుమార్లు దురాగతానికి పాల్పడ్డారు. చివరకు తల్లిదండ్రుల సాయంతో బాధిత బాలిక పోలీసులను ఆశ్రయించింది. దీంతో విషయం వెలుగు చూసింది.

బాలిక కుటుంబం ఇచ్చిన పోలీసు ఫిర్యాదు మేరకు రంభ నగర్ ప్రాంతానికి చెందిన18 -19 సంవత్సరాల మధ్య వయస్సున్నముగ్గురు నిందితులను బుధవారం రాత్రి అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి అలోక్ శ్రీవాస్తవ తెలిపారు. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు. కాగా డేంజర్ పబ్‌జీ గేమ్ ను కేంద్రం బ్యాన్ చేసినా, డౌన్ లోడ్ పై నిషేధం ఉన్నా ఇప్పటికే  దీనికి యాక్సెస్ ఉన్న వారితోపాటు, కొత్తగా డౌన్ లోడ్ కూడా అవుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు