మరణంలోనూ వీడని స్నేహం..

3 Apr, 2021 21:47 IST|Sakshi

హాలియా :  నాలుగు సంవత్సరాలు కలిసి చదువుకున్నారు. ప్రాంతాలు వేరైనా ప్రాణస్నేహితులుగా కలిసి తిరిగారు. తాము చదువుతున్న కళాశాలలో స్టడీ బుక్స్‌ తెచ్చుకునేందుకు ముగ్గురు మిత్రులు ఒకే బైక్‌పై వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డారు. అనుముల మండలంలోని చింతగూడెం స్టేజీ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాల్లో విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అనుముల గ్రామానికి చెందిన బొడ్డుపల్లి మహేష్‌ (18), గుర్రంపోడు మండలంలోని మొసంగి గ్రామ పంచాయతీ పరిధిలోని నడ్డివారిగూడేనికి చెందిన నడ్డి శ్రీకాంత్‌(19), పెద్దవూర మండలంలోని చింతపల్లి గ్రామానికి చెందిన మాదవరం శివ(18) ముగ్గురు ప్రాణస్నేహితులు. 2019–20 విద్యాసంవత్సరంలో హాలియాలోని టైం స్కూల్‌లో వీరు పదో తరగతి పూర్తి చేశారు. నల్లగొండలోని గౌతమ్‌ కళాశాలల్లో ఇంటర్‌ మొదటి సంవత్సరంలో చేరారు.

పరీక్షలు సమీపిస్తుండంతో కళాశాల్లో ఉన్న స్టడీ బుక్స్‌ తెచ్చుకునేందుకు నడ్డివారిగూడెం గ్రామానికి చెందిన నడ్డి శ్రీకాంత్‌ తన మోటర్‌ బైక్‌పై చింతపల్లి గ్రామానికి చెందిన మాదవరం శివను ఎక్కించుకుని హాలియాకి వచ్చారు. హాలియాలో ఉన్న బొడ్డుపల్లి మహేష్‌ను బైక్‌పై ఎక్కించుకొని నల్లగొండకి బయలుదేరారు. అక్కడినుంచి వెళ్లిన కొద్ది నిమిషాల్లోనే చింతగూడెం స్టేజీ సమీపం వద్ద వీరి బైక్‌ను నల్లగొండ నుంచి హాలియా వైపు వస్తున్న టిప్పర్‌ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ముగ్గురూ అక్కడిక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న హాలియా సీఐ వీరరాఘవులు, ఎస్‌ఐ శివకుమార్‌ తన సిబ్బంది కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదకానికి గల కారణాలను అక్కడ ఉన్న వారిని అడిగి తెలుసుకున్నారు. టిప్పర్‌ డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరరాఘవులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సా­గర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తర­లించారు. పోస్టుమార్టం అనంత­రం మృతదేహాలను వారి బంధులకు 
అప్పగించారు.

అంతా పేద కుటుంబాల వారే..
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ముగ్గురూ పేద కుటుంబాలకు చెందిన వారే. బొడ్డుపల్లి మహేష్‌ తండ్రి ఈదయ్య, నడ్డి శ్రీకాంత్‌ తండ్రి లింగయ్య కూలి పనులు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటుండగా మాధవరం శివ తండ్రి చిన బ్రహ్మయ్య కొద్దిపాటి భూమిని కౌలు తీసుకొని జీవనం సాగిçస్తున్నాడు. బొడ్డుపల్లి మహేష్, నడ్డి శ్రీకాంత్‌ ఇద్దరూ వారి కుటుంబాలకు పెద్ద కుమారులు కాగా మాదవరం శివ వారి కుటుంబంలో చిన్నవాడు. ఉన్నత చదువులు పూర్తి చేసి తమ కుటుంబాలకు తోడుగా ఉంటారని భావించిన వారి కుటంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు