నకిలీ డాక్టర్ల దోపిడీ గుట్టు రట్టు..!

19 Aug, 2021 18:58 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలోని బృహన్ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్ గోవాండి-శివాజీనగర్ ప్రాంతాలలో ఐదుగురు నకిలీ డాక్టర్లను గురువారం పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు ఈశాన్య ముంబైలోని మురికివాడల్లో రోగుల నుంచి వైద్యం పేరిట విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం..  పోలీస్ ఇన్స్‌పెక్టర్ హెచ్‌ఎమ్ నానవారే, కానిస్టేబుల్ ఎన్‌బీ సావంత్ నకిలీ డాక్టర్లపై దర్యాప్తు చేసి, ఎం- ఈస్ట్ వార్డ్ బీఎంసీ అసిస్టెంట్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ప్రియా కోలికి సమాచారం అందించారు. దీంతో  బీఎంసీ అధికారులు, పోలీసుల బృందం బుధవారం మురికివాడల్లో  ఐదుగురు నకిలీ వైద్యుల స్థావరాలపై దాడి చేశారు. వారు రోగుల నుంచి వివిధ రకాల చికిత్సల కోసం విపరీతంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు.

డిగ్రీలు లేవు.. అన్ని రకాల రోగాలకు చికిత్స
నకిలీ డాక్టర్లకు మెడికల్ డిగ్రీలు గానీ మహారాష్ట్ర మెడికల్ కౌన్సిల్ లేదా మరే ఇతర అథారిటీ నుంచి కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న పత్రాలు లేవని  ఓ అధికారి చెప్పారు. కాగా వారు అన్ని రకాల వ్యాధులకు, గాయాలకు ఇంజెక్షన్లు, మందులు, శస్త్రచికిత్సలకు సలహా ఇవ్వడం మొదలైన అన్ని రకాల రోగులకు చికిత్స చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ  ఐదుగురు నకిలీ డాక్టర్ల వయసు 43 నుంచి 53 సంవత్సరాల మధ్య  ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

భారీ ఎత్తున వైద్య సామాగ్రి స్వాధీనం
నకిలీ డాక్టర్ల నుంచి భారీ ఎత్తున స్టెతస్కోప్‌లు, ఇంజెక్షన్లు, డ్రిప్పు బాటిళ్లు, శస్త్రచికిత్స ట్రేలు, అన్ని రకాల మందులు, సిరప్‌లు, యాంటీబయాటిక్స్ కొన్ని సున్నితమైన లేదా పరిమిత వినియోగ మందులు, వైద్యశాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు, వైద్య సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఐదుగురు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌, మహారాష్ట్ర మెడికల్ ప్రాక్టీషనర్స్ చట్టం, 1961లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు