మూడుముళ్లంటూ టీచర్‌కు మస్కా 

15 Aug, 2022 10:20 IST|Sakshi

బనశంకరి: ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.7.6 లక్షలు వంచనకు పాల్పడ్డాడో మోసగాడు. బెంగళూరులోని సర్జాపుర రోడ్డు కృతిక గోయల్‌ (30) బాధితురాలు. పెళ్లి చేసుకోవడానికి తగిన వరుడు కావాలని కృతిక.. మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ప్రొఫైల్‌ను పెట్టింది. అది చూసి ఒక యువకుడు ఆమెను సంప్రదించాడు, తాను మంచి ఉద్యోగం చేస్తున్నానని చెప్పి స్నేహం చేశాడు.

అతన్ని పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తన తండ్రి ఆనారోగ్యం బారినపడ్డారని రూ.7.60 లక్షలు పంపాలని, వెంటనే డబ్బు వెనక్కి ఇస్తానని ఆ యువకుడు కథ చెప్పాడు. అతని మాటలు నమ్మిన కృతిక ఆ డబ్బు పంపింది. ఆ తరువాత యువకుడు అడ్రస్‌ లేకపోవడంతో టోపీ వేశాడని తెలుసుకున్న బాధితురాలు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.  

బహుమానం వచ్చిందని రూ.5.37 లక్షలు..  
బహుమానం కోసం ఆశ పడి ఓ అభాగ్యుడు రూ. 5.37 లక్షలను కోల్పోయాడు. ఈ సంఘట మైసూరు జిల్లాలోని సరగూరు తాలూకా కోడగి గ్రామంలో జరిగింది. రాము అనే వ్యక్తి ఇంటికి న్యాప్‌టోల్‌ అనే కంపెనీ  నుంచి పార్శిల్‌ వచ్చింది. అందులో ఒక కూపన్‌ ఉంది, మీకు రూ. 7.50 లక్షల లాటరీ తగిలిందని, ఆ డబ్బులు పంపాలంటే బ్యాంకు చార్జ్, జీఎస్‌టీ, టిడిఎస్, కమీషన్‌ ఇవ్వాలని రాసి ఉంది.

దానిని నమ్మిన రాము తన భార్య, స్నేహితుల వద్ద రూ. 5.37 లక్షలను తీసుకొచ్చి కంపెనీ చెప్పిన ఖాతాలోకి జమ చేశాడు. బహుమానం కోసం ఫోన్‌ చేయగా, ఇంకా కొన్ని రుసుములు చెల్లించాలని, లేదంటే కానుక రద్దవుతుందని బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన రాము సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

(చదవండి: విడాకుల కోసం వచ్చి మళ్లీ ఒకటయ్యారు.. మధ్యలో ఏం జరిగిందంటే!)

మరిన్ని వార్తలు