దైవదర్శనం కోసం 30 మంది వెళుతుండగా.. అంతలో..

5 Dec, 2021 11:38 IST|Sakshi
రాధ (ఫైల్‌)

సాక్షి,వెల్దుర్తి(కర్నూలు): దైవ దర్శనానికి బయలుదేరిన భక్త బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో శనివారం జరిగిన  ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా.. 15 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరో 10 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఏటా కార్తీక మాసం అమావాస్య సందర్భంగా కోడుమూరు కొండపేటకు చెందిన పెద్దయ్య కుటుంబం, వివిధ ప్రాంతాల్లో వారి బంధువర్గం వెల్దుర్తి మండల పరిధిలోని శ్రీరంగాపురం కొండల్లో వెలసిన పాలుట్ల రంగస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ.

ఈ క్రమంలో శనివారం 30 మంది బొలెరో వాహనంలో బయలుదేరారు. డోన్‌ మండలం వెంకటాపురానికి చెందిన రంగడు, తన భార్య రంగమ్మ, కూతురు రాధ (14)తో కలిసి మదార్‌పురం వద్ద బొలెరో ఎక్కారు. అక్కడి నుంచి వాహనం గోవర్ధనగిరి, శ్రీరంగాపురం మీదుగా వెళ్తుండగా ఆలయానికి కి.మీ దూరంలో ఘాట్‌ రోడ్డు ప్రారంభంలో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు డోన్‌ బాలికల జెడ్పీ హెస్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. గాయపడిన వారిలో మృతి చెందిన బాలిక తల్లిదండ్రులతో పాటు కోడుమూరుకు చెందిన పెద్దయ్య, రేవతి, సరోజ, మహేశ్వరమ్మ, రామలక్ష్మమ్మ, చాముండేశ్వరి, రంగస్వామి, రాజు, గణేశ్, విజయచంద్రసాయి, మంజుల, గౌరమ్మ, శివకృష్ణ, నారాయణమ్మ, పద్మావతి, రాధ, సుశీలమ్మ, నాగప్ప, వెంకటేశ్, లక్ష్మీదేవి, శ్రీరాములు, రాఘవేంద్ర, ముంతాజ్‌బేగం, డ్రైవర్‌ రామలింగడు ఉన్నారు.

 డోన్, ప్యాపిలి,  వెల్దుర్తి నుంచి వచ్చిన మూడు 108 వాహనాల్లో క్షతగాత్రులను వెల్దుర్తి ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్‌ సాగరిక ప్రాథమిక చికిత్స చేసి 15   మందిని మెరుగైన వైద్యం నిమిత్తం కర్నూలుకు తరలించారు. వెల్దుర్తి ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి ప్రమాద స్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం డోన్‌ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డోన్‌ రూరల్‌ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు.

చదవండి: భర్త లింగమార్పిడి.. మరొకరితో సహజీవనం.. అంతలోనే..

మరిన్ని వార్తలు